Pawan Kalyan undergoes surgery: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురి కావడంతో శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర సర్జరీ నిర్వహించారు. కొంతకాలంగా శారీరక శ్రమ , పని ఒత్తిడితో సతమతమవుతున్న ఆయనకు శుక్రవారం అధికారులతో పాలనాపరమైన సమీక్షలో ఉండగానే అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆయన చికిత్సకు వెళ్లాల్సి వచ్చింది.
వైద్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్ రిపోర్టులను విశ్లేషించిన డాక్టర్ల బృందం, జాప్యం చేయకుండా ఆపరేషన్ చేయాలని నిర్ణయించింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే, పవన్ కళ్యాణ్‌కు ఎదురైన అసలు ఆరోగ్య సమస్య ఏమిటన్నది మాత్రం ఆయన వ్యక్తిగత బృందం గానీ, ఆసుపత్రి వర్గాలు గానీ అధికారికంగా వెల్లడించలేదు.
శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడానికి కనీసం పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఈ పది రోజులు ఎటువంటి రాజకీయ లేదా అధికారిక పర్యటనలు చేయకూడదని, ఇంట్లోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. పూర్తి స్వస్థత చేకూరడానికి మరికొంత కాలం పడుతుందని, ఆహారం, ఇతర అలవాట్ల విషయంలో దీర్ఘకాలిక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దీంతో ఆయన చేపట్టాల్సిన జిల్లాల పర్యటనలు, శాఖల పనులు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి.
