AP Forest Department Drone Seeding: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం, క్షీణించిన అడవులను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతాల్లో ఏకో-రిస్టోరేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ డ్రోన్ సాంకేతికతకు శ్రీకారం చుట్టారు. మనుషులు నేరుగా వెళ్లలేని లోయలు, దట్టమైన అటవీ ప్రాంతాలలో సీడ్ బాల్స్ చల్లేందుకు డ్రోన్లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షపాతం మరియు నేలలో తేమ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన బంతుల జారవిడిచే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.
50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
కూటమి ప్రభుత్వం నిర్దేశించుకున్న 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించడంలో ఈ సీడ్ బాల్స్ కార్యక్రమం అత్యంత కీలకమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీశాఖ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగం దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో 63 లక్షలకు పైగా విత్తన బంతులను ఇప్పటికే చల్లారు. మానవ వనరుల సాయంతో చేరుకోలేని దుర్గమ ప్రాంతాల్లో దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో సాంకేతికతను జోడించి డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచి కొత్త రికార్డు సృష్టించారు.
రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో అత్యధికంగా 28 లక్షల సీడ్ బాల్స్
జిల్లాల వారీగా పరిశీలిస్తే రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో అత్యధికంగా 28 లక్షల సీడ్ బాల్స్ చల్లగా, అందులో 2.26 లక్షల బంతులను కేవలం డ్రోన్ల సాయంతోనే లోయ ప్రాంతాల్లో జారవిడిచారు. అలాగే విశాఖపట్నం అటవీ డివిజన్‌లో 7.50 లక్షలు, కర్నూలు ప్రాంతంలో 8.67 లక్షల విత్తన బంతుల విసిరే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం చింతూరు, పీటీ ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం , కడప డివిజన్లలో కష్టతరమైన కొండలు, లోయ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఈ సీడ్ బాల్స్ పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ ప్రక్రియకు సవాలుగా మారవచ్చు. అందుకే వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ఏమాత్రం జాప్యం చేయకుండా సీడ్ బాల్స్ చల్లాలి. అవసరమైతే డ్రోన్ల సంఖ్యను మరింత పెంచండి అని సూచించారు. అడవులు క్షీణించిన ప్రతీ చోటా పునరుద్ధరణ పనులు వేగవంతం కావాలని, రాబోయే రోజుల్లో 30 వేల హెక్టార్లలో సీడ్ బాల్స్ వెదజల్లే సుదూర లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు.
మొలకలను సంరక్షించడం కూడా కీలకం
కేవలం విత్తన బంతులు చల్లడమే కాకుండా, వాటి ద్వారా వచ్చే చిన్న చిన్న మొలకలను సంరక్షించడంపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఎండ తీవ్రతను తట్టుకుని ఆ మొలకలు పెద్ద చెట్లుగా మారేలా సంరక్షించే బాధ్యతను అటవీశాఖ అధికారులు స్వీకరించాలని స్పష్టం చేశారు. అధికారులు ఈ మహత్కార్యంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని, క్షేత్రస్థాయిలో సీడ్ బాల్స్ పురోగతిని, మొక్కల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
