జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలో రోజంతా పాల్గొన్నపవన్ కల్యాణ్.. సాయంత్రం ప్రసంగించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మారుతున్నారని అందుకే వ్యతిరేక ఓటు చీలిపోవద్దని అన్నానన్నారు. జనసైనికులకు తానెంటో తెలుసని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వ్యతిరకే ఓటు చీలికపోకూడనది ఏకవాక్య తీర్మానం చేస్తే ఎందుకంత భయమని ప్రశ్నించారు. వ్యతిరేక ఓటు చీలిపోకూడదంటే భయపడిపోతారా అని ప్రశ్నించారు. ఎవరి పల్లకీనో మోసేందుకు తాము లేమని స్పష్టం చేశారు.
కౌలు రైతులకు ఆర్థిక సాయం కోసం ఉద్యమం
రైతు ఆత్మహత్యలకు మీరు కారణం కాదా అని వైఎస్ఆర్‌సీపీ నేతలను పవన్ ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. రైతు లేకపోతే జీవనాధారం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వివిధ జిల్లాల్లో కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..కష్టాల్లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలో అనేదే తాను ఆలోచిస్తాన్నారు. కులం లేని రైతుకు అండగా ఉండాలన్నారు. మనసు ఉండి సాయం కోసం కదిలించగలిగితే అవే డబ్బులు వస్తాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఉద్యమం చేస్తామన్నారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకివచ్చి.. రేట్లు పెంచితే.. తాగరని తప్పుడు లాజిక్ చెప్పారన్నారు. కానీ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. 2024కు మేము వస్తామని కానీ అప్పటి వరకూ మీ బిడ్డలు ఉండాలి కదా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ రావట్లేదు !
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ మళ్లీ గెలవదని.. రాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తప్పకుండా రాదన్నారు. ఐఏఎస్ అధికారులు మోకాళ్లపై కూర్చుకుంటే పాలన సరిగ్గా లేదని అర్థమని.. 2024లో రాని ప్రభుత్వం కోసం మీరు తపన పడవద్దని సెటైర్ వేశారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన విధ్వంసానికి ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలబడటానికి సిద్ధంగా ఉండే మాట్లాడుతున్నాన్నారు. దళిత గిరిజన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే పథకాన్ని ఆపేశారని విమర్శించారు.
జనసేనకు పవన్ రూ. ఐదు కోట్ల విరాళం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఏకంగా రూ.ఐదు కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు చెక్‌ను పార్టీ కోశాధికారికి అందించారు. జనసేన పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీకి పవన్ విరాళం ప్రకటించారు. పార్టీ నడపడం అంటే చిన్న విషయం కాదని.. ఎంతో ఖర్చుతో కూడుకున్నదని.. పార్టీని నడిపేందుకే తానుసినిమాలు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారు. దానికి తగ్గట్లుగానే తన ఆదాయంలో చాలా వరకూ పార్టీకి విరాళంగా ఇస్తున్నారు.