ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ  నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నిర్వహణ లేక పోవడంతో వేల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. వీటిపై పోరాటం చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని జనసేన నిర్ణయించుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉద్యమం చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించడంతో ఈ మేరకు పార్టీ నేతలంతా ఆలోచించి... జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని ప్రకార ప్రభుత్వం రోడ్లు మరమ్మత్తు చేసే దిశగా ఒత్తిడి తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.  


ఏపీలో 1,26,000 కిలోమీటర్ల మేర రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ..  ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, నిత్య నరకం చూస్తున్నా ప్రభుత్వ వైఖరిలో చలనం లేదని ప్రభుత్వంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోది. రూ.12,450 కోట్ల రూపాయలు రహదారులు బాగుకోసం కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా రహదారులను బాగు చేశారో చూపించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.  అక్రమాలకు పాల్పడటం కోసమే రహదారుల మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారని, కానీ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఎక్కడ రహదారుల మరమ్మతులు జరిగినట్లు కనిపించడం లేదని వెల్లడించారు. 


రోడ్లు పూడుస్తుంటే కేసులు పెడుతున్నారు: బాలగంగాధర్ తిలక్


దేశవ్యాప్తంగా తన సొంత డబ్బులతో ఇప్పటివరకు 2100 గుంతలను పూడ్చానని రోడ్‌ డాక్టర్‌ కాట్నం బాలగంగాధర్‌ తిలక్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తాను రహదారి గుంతలను పూడుస్తుంటే తనపై పోలీసు కేసులు పెడతామంటూ వేధిస్తున్నారని వెల్లడించారు.  వెళ్లే దారిలో ఎక్కడైనా గుంత కనిపిస్తే వెంటనే కారు దిగి దానిని పూడ్చేయడం తనకు అలవాటని చెప్పారు. దానికోసం తన కారులో సిద్ధంగా గుంతలను పూడ్చే మెటీరియల్‌ను ఎప్పుడూ ఉంచుకుంటానని చెప్పారు. అయితే గుంతలను పూడిస్తే వేధింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ఎక్కడా తనకు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో గుంతలు పూడుస్తుంటే.. నగర మున్సిపల్‌ అధికారులు సహకరించకపోగా, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసి వేధింపులకు గురిచేశారంటూ తిలక్‌ వెల్లడించారు. రాష్ట్రంలో రూ.లక్షతో పూర్తయ్యే పనికోసం రూ.కోటి ఖర్చు చేస్తున్నారని, ఆ గుంతలను తాను పూడిస్తే వారికి కాంట్రాక్టులు ఉండవనే ఇలా చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు.


గుంతలు పూడుస్తుంటే తనపై కేసులు పెడుతున్నారని..  బాలగంగాధర్ అనడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. అమ్మా పెట్టనివదు.. అడుక్కుతిననివ్వదు అంటూ ట్వీట్ చేశారు.