Pawan Kalyan : ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం బిల్లులో సవరణ తీసుకు రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పేరు మార్చి ఏం సాధిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ అని పేరు పెట్టినంత మాత్రాన రాష్ట్రంలో వైద్య వసతులు మెరుగుపడతాయా.. చెప్పాలన్నారు. ప్రస్తుతం ఏపీలో ఆరోగ్య రంగం పరిస్థితి దుర్భరంగా ఉందని.. పేదలకు సరైన వైద్యం అందడం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు.. మందులు అందుబాటులో లేవన్నారు. మెరుగుపర్చాల్సిన ఎన్నో అంశాలు ఉండగా అన్నింటినీ వదిలేసి పేరుమార్పు వివాదమెందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
మార్చుకోవాలనుకుంటే కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరు మార్చుకోవచ్చుగా !
కోవిడ్ సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ ను వేధించడంతో మానసిక వ్యథకు లోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకో.. కొత్త వివాదాలు సృష్టించేందుకో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందన్నారు. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ పోతే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. పేర్లు మార్చాలని అనుకుంటే విశాఖలో కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరు మార్చవచ్చన్నారు. ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉందన్నారు. స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి.. ఆ పేరు తీసేసి.. వైద్య ప్రముఖుల్లో ఒకరి పేరు పెట్టాలని పవన్ సీఎం జనగ్‌కు సూచించారు.
యల్లాప్రగడ సుబ్బారావు పేరు ఒక్క సంస్థకైనా పెట్టే ఆలోచన చేశారా ?
అసలు జగన్ సర్కార్‌కు ప్రపంచ ప్రఖ్యాత వైద్య ప్రముఖుల్లో ఒకరు. తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు గురించి తెలుసా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఏ పాలకులూ పట్టించుకోలేదన్నారు. వైద్య విశ్వ విద్యాలయానికి ఆ రంగంలో ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు పేరును పరిశీలించేవారన్నారు. టైఫాయిడ్, బోదకాలు వంటి రోగాలకు మందులు కనుగొని .. ప్రపంచవ్యాప్తంగా పేరు ఫ్రఖ్యాతుల పొందిన శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు అని పవన్ గుర్తు చేశారు. ఆయన పేరును ఒక్క సంస్థకైనా పెట్టారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
రాజకీయంగా పెను వివాదం అయిన ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు
రాజకీయాల్లో పెను వివాదంగా ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు అంశం చేరింది. అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని పేరు మార్చారని ప్రశ్నిస్తున్నారు. ఏదో అంశంపై టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారని .. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఇలాంటి వాటితో ... ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు పేరుమార్పును ఖండించడంతో ఈ వివాదం మరింత పెరిగి పెద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.