Pawan Kalyan :  రైతులపై కేసులు పెడితే ఊరుకునేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజమండ్రిలో  జనసేన నూతన కార్యాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.  అకాల క్షేత్ర స్తాయి పర్యటనలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవటం, వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించకపోవటం, ముఖ్యమంత్రి స్పందించకపోవటం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. రుణమాఫీ వద్దని... పావలా వడ్డీకి ఎకరానికి 25 వేలు రుణం ఇస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారని తెలిపారు. గోనె సంచులు ఇవ్వకపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.                                   

  


 





 


ప్రతీ గింజ కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. జనసేనకు ఆవేదన చెప్పిన రైతులను వేదిస్తే వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందన్నారు. ‘‘రాజమండ్రి నడిబొడ్డు నుంచి హెచ్చరిస్తున్నా... రైతులపై లాఠీచార్జీలు చేసినా, బైండోవర్ కేసులు పెట్టినా వైసీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.                                                  


వర్షాల కారణంగా పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాల పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం అంతా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కళ్లాల్లో నిలువ ఉన్న, మొలకెత్తిన, తడిసిన ధాన్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పలువురు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. అధికారులు తమ గోడు వినిపించుకోవడంలేదని, రైస్‌ మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే భారీగా కోతలు విధిస్తున్నారని పలువురు రైతులు ఆయన వద్ద వాపోయారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టపోయాని తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రైతులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.                                    


రైతుల పట్ల పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగు మారిన, మొలకెత్తిన ప్రతి గింజనూ మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వేమగిరి నుంచి కొత్తపేట వరకూ పవన్‌కు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యమధ్యలో రైతులు తీసుకొచ్చిన మొలకెత్తిన వరి కంకులను పరిశీలించారు.  పవన్ కల్యాణ్ వస్తున్నారని చెప్పి హడావుడిగా కొన్న ప్రాంతాల్లో ధాన్యాన్ని రైతులు కనుగోలు చేశారు.