Pattabhi Release :   టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో  రాజమండ్రి సెంట్రల్ జైలు నుుంచి విడుదలయ్యారు.   పట్టాభికి టీడీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.  ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడి లొంగిపోయేది లేదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. గన్నవరంలో ఏం జరిగిందో అందరూ చూశారని వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు.  పోలీస్ స్టేషన్‌లోనే దుండగులతో తనపై దాడి చేయించిన తీరును ప్రజలందరూ చూశారన్నారు. ఎన్ని దాడులు జరిగినా తాను వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పారు. 


దాడులు చేసినా బెదిరేది లేదన్న పట్టాభి ! 


టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అడుగు ముందుకు వేస్తామని చెప్పారు. కష్టసమయంలో తనకు, తన కుటుంబసభ్యులకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ ఇతర నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు..ప్రజల తరపున పోరాడుతున్న గొంతుక ఆగదని..  తోట్లవల్లూరు పోలీస్‍స్టేషన్‍లో ముగ్గురు వ్యక్తులు నాపై దాడికి పాల్పడ్డారని మరోసారి ఆరోపించారు.   పోలీసులను బయటకు పంపి ముసుగులు ధరించిన వ్యక్తులు నన్ను హింసించారన్నారు.  కష్టకాలంలో అండగా నిలిచిన చంద్రబాబుకు  కృతజ్ఞతలు తెలిపారు. పట్టాభితో పాటుగా మరో 11 మంది నేతలకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం  శుక్రవారం సాయంత్రం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 25 వేల రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని, 3 నెలల పాటు ప్రతి గురువారం న్యాయస్థానంలో హాజరు కావాలని న్యాయమూర్తి సత్యానంద్‌ షరతులు విధించారు.  


గన్నవరంలో జరిగిన ఘర్షణల్లో సీఐపై హత్యాయత్నం జరిగిందని పట్టాభిపై కేసు                 


పది రోజుల కిందట  గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది.  టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు.  ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. దీంతో  ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలు గన్నవరంకు  వెళ్లారు. అలా వెళ్లిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు.  టీడీపీ నేత ఇంటిపై దాడి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గన్నవరం వచ్చానని పట్టాభి చెప్పారు. అయితే ఆయన కారుపై దాడి జరిగింది. పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. తర్వాతి రోజు .. సీఐ కనకారావుపై జరిగిన రాళ్ల  దాడికి కారణం పట్టాభినేనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ వన్ గా పట్టాభి పేరు పెట్టి..  అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 


పోలీసులు కొట్టారని  ఆరోపించిన పట్టాభి                     


అయితే పోలీసులు తనను కస్టడీలో కొట్టారని పట్టాభి కోర్టులో హాజరు పరిచిన సమయంలో చెప్పారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన తర్వాత చేతికి మాత్రమే వాపు ఉందని డాక్టర్లు రిపోర్టు ఇవ్వడంతో జైలుకు తరలించారు. గన్నవరం జైల్లో ఉంటే శాంతిభద్రతల సమస్య వస్తుంది కాబట్టి రాజమండ్రికి తరలించాలని పోలీసులు పిటిషన్ పెట్టుకోవడంతో కోర్టు అంగీకరించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. అప్పట్నుంచి రాజమండ్రి జైల్లోనే పట్టాభిరాం ఉన్నారు. అయితే అది అక్రమ అరెస్టు అని అసలు కేసు పెట్టిన సీఐ ఎస్సీ కాదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.