శృంగవరపుకోట: ఏపీలో మరో రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం - భవానీపట్నం ప్యాసింజర్ రైలు కొత్తవలస స్టేషన్ లో ఒక్కసారిగా పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ ఎం హెచ్ ఆర్ కృష్ణ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. తాజా ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 నిమిషాలకు విశాఖపట్నం - భవానీపట్నం ప్యాసింజర్ రైలు బయలుదేరింది. గంట వ్యవధిలోనే కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నెంబర్ 5 నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు రెండో నంబరు లైన్ కు మారుతుండగా పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. ట్రాక్ మార్చే క్రమంలో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.