RTC Charges Hike Protest : పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా సీపీఎం నేతలు ఎడ్ల బండ్లతో నిరసన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని ప్రజలు, సీపీఎం నేతలు పెంచిన బస్ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ బస్సు వద్దు ఎడ్ల బండే ముద్దు అంటూ నిరసన చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు బాదుడే బాదుడు అంటూ ఆందోళన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని ఛార్జీలు తెలుగుదేశం వారు పెంచుతున్నారు బాదుడే బాదుడు అన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ దానికి మించి వీర బాదుడే బాదుడుగా ఛార్జీలు పెంచారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు
పెంచిన బస్సు ఛార్జీలు విరమించుకోవాలని కోరుతూ కొమరాడ మండల కేంద్రంలో సీపీఎం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొళ్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఇవాళ సామాన్య ప్రజలకు నడ్డివిరిచే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. జగన్ పాదయాత్ర చేసే సమయంలో టీడీపీ ప్రభుత్వం అన్ని రేట్లు పెంచేస్తున్నారని బాదుడే బాదుడు అని చెప్పి తాను అధికారంలోకి వచ్చారన్నారు. అన్నీ రేట్లు తగ్గిస్తానని చెప్పిన సీఎం జగన్ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి మించి వీర బాధుడుగా బస్ ఛార్జీలు పెంచారన్నారు. పెట్రోలుస, డీజిల్ గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు, ఇంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు వీర బాధుడుగా పెంచే పరిస్థితి ఉందన్నారు.
ఉద్యమం ఉద్ధృతం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆలోచించి పెంచిన బస్ ఛార్జీలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేటు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని సీపీఎం నేతలు అన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఒక దానికొకటి రేట్లు పెంచుకుని పోతుంటే సామాన్య ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు తగ్గించని క్రమంలో తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు రాము లక్ష్మణ్ రావు, చిన్న వెంకయ్యనాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు.