Palnadu News :పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. బాలికలు జ్వరం, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సృహతప్పి పడిపోయారు.  దీంతో బాలికలను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  


జవహర్ నవోదయ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 


కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. వయనాడ్‌ జిల్లాలోని లక్కిడి ప్రాంతంలో గల జవహర్‌ నవోదయ విద్యాలయంలో సుమారు 486 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్ లో అందించిన ఆహారం తిన్నాకా 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడడంతో  పాఠశాల సిబ్బంది వారిని చికిత్స కోసం  స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు  వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఫుడ్‌ పాయిజన్‌ అవ్వడానికి కారణాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒకేసారి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ ఘటనకు బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.


హైస్కూల్ ఫుడ్ పాయిజన్, 36 మంది విద్యార్థులకు అస్వస్థత 


 మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  మహారాష్ట్రలోని సాంగ్లీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హైస్కూల్లో 5,7వ తరగతుల విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం సెంట్రల్‌ కిచెన్‌లో అన్నం, ప‌ప్పు కూర‌తో భోజనం చేసిన త‌రువాత అస్వస్థత‌కు గురయ్యారు. మొత్తం 36 మంది విద్యార్థులు అస్వస్థత‌కు గురి కాగా వెంట‌నే వారిని స్థానిక ఆస్పత్రికి త‌ర‌లించారు. వీరిలో 35 మంది విద్యార్థులను చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఒక విద్యార్థిని మాత్రం అబ్జర్వేష‌న్‌లో ఉంచి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఆ విద్యార్థి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌నపై విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ వాన్‌లెస్‌వాడి ఉన్నతపాఠశాల మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 36 మంది విద్యార్థులు కడుపునొప్పి, వికారంతో అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ సెంట్రల్ కిచెన్ నుంచి సేక‌రించిన‌ ఆహార నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు.  ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ కోసం ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిటీని వేసినట్లు తెలిపారు.


 బిర్యానీ తిని యువతి మృతి 


కేరళలో  20 ఏళ్ల యువతి ఇటీవల బిర్యానీ తిని ప్రాణాలు కోల్పోయింది. కేరళలో ఫేమస్ వంటకం అయిన "కుజిమంతి" బిర్యానీని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న యువతి...అది తిన్న వెంటనే అనారోగ్యానికి గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...అంజు శ్రీపార్వతి అనే యువతి కసరగాడ్‌లో ఉంటోంది. గతేడాది డిసెంబర్ 31న ఆన్‌లైన్‌లో ఓ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుంది. అది తిన్నాక అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న యువతి..చివరకు మృతి చెందింది.  "తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ ఉదయం బాధితురాలు చనిపోయింది" అని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మొదట వైద్యం అందించారు. అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడే బాధితురాలు చనిపోయింది.