High Tensions in AP: పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రంలో వైసీపీ నేతల అరాచకం సృష్టించారు. కారంపూడిలోని తమ కార్యాలయంపై అధికార పార్టీ శ్రేణులు దాడి చేసినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. మే 13 పోలింగ్ రోజున ఉద్రిక్తతల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు పేటసన్నెగండ్ల గ్రామానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తున్నారు. ఆ క్రమంలోనే కారంపూడిలో తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భయానక వాతావరణం సృష్టించారని అంటున్నారు.


టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయటంతో పాటు అక్కడ ఉన్న టీడీపీ నేత జానీ బాషా వాహనానికి నిప్పు అంటించారు.  దాడులు ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణ స్వామిపై కూడా దాడికి తెగబడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఐ నారాయణస్వామికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.


ఈ ఘటనలతో పల్నాడు జిల్లా కారంపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 200 మంది వైసీపీ కార్యకర్తలు కారంపూడిలో హల్ చల్ చేశారు. కారంపూడి పట్టణంలో మారణాయుధాలతో హడావుడి చేశారు. కనపడిన వారిని కనపడ్డట్టు టీడీపీ కార్యకర్తలను తరిమి తరిమి కొట్టారు. చెక్ పోస్ట్ సెంటర్లో టీడీపీకి సంబంధించిన ఓ కారును వైసీపీ నాయకులు తగులబెట్టారు. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి భయంతోనే ఈ దాడులు చేయిస్తున్నారని.. కారంపూడి ప్రజలు భయబ్రాంతులు చెందుతున్నారు.