Macherla TDP Ysrcp Clash : పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులకు పాల్పడ్డారు. మాచర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘర్షణ జరిగింది. టీడీపీ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు వద్ద ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. చిన్న కాన్వెంట్‌ సమీపంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఇరు పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, సీసాలు విసురుకుని దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రదర్శన నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. మాచర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరి మూకలు 


మాచర్లలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు. అల్లరి మూకలను పోలీసులు అడ్డుకుంటున్నాారు. టీడీపీ నేతల వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు బ్రహ్మారెడ్డిపై లాఠీ ఎత్తడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. 








పోలీసుల సహకారంతోనే దాడులు- లోకేశ్ 


మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ వారిపై  వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనమన్నారు. దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసిన పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చెయ్యడం, మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం వైసీపీకి కొమ్ముకాయడమే అన్నారు. టీడీపీ వర్గీయుల కార్లు తగలబెట్టి, దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని లోకేశ్ ప్రకటించారు. 


మాచర్ల పిన్నెల్లి జాగీరా? - అచ్చెన్నాయుడు


మాచర్ల ఏమైనా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జాగీరా? ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే బ్రహ్మారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదుకార్లు ధ్వంసం చేసి, టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి దగ్గరుండి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో దాడి చేస్తుంటే చూస్తూ ఉండటం దుర్మార్గమన్నారు. టీడీపీ సానుభూతి పరుల షాపులను కూడా తగలబెట్టారని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తోన్న బ్రహ్మారెడ్డికి వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. మాచర్లను గూండాగిరితో మూడున్నరేళ్లుగా చేతిలో పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవడంతో విధ్వంసాలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల దుశ్చర్యలను పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బ్రహ్మారెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. బ్రహ్మారెడ్డికి చిన్నపాటి అపాయం కలిగించినా టీడీపీ కార్యకర్తలతో పిన్నెల్లి ఇంటిని ముట్టడిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. బ్రహ్మారెడ్డిని చూసి పిన్నెల్లి  ప్రతి రోజూ భయపడుతూ బ్రతుకుతున్నారన్నారు. ఖబడ్దార్ పిన్నెల్లి నీ పని అయిపోయిందన్నారు.