Over Flowing Reservoirs In Ap: ఏపీని భారీ వర్షాలు వీడడం లేదు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలంలకు వరద పోటెత్తుతోంది. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు, అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని తాండవ జలాశయంలో (Thandava Resetvoir) నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అధికారులు ఇక్కడ రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 379 అడుగులుగా నమోదైంది. తాండవ జలాశయం వరద రహదారిపై పొంగి ప్రవహిస్తోన్న క్రమంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉప్పరగూడెం - గన్నవరం మెట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు, కల్యాణపులోవ జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం - తుని మధ్య వాహనాల రాకపోకలను నిలిపేశారు. నర్సీపట్నం - తుని మధ్య వాగులు పొంగి పొర్లుతున్నాయి.
- అల్లూరి జిల్లాలోని (Alluri District) వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వట్టిగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జోలాపుట్ జలాశయం నుంచి 23 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అటు, డుడుమా జలాశయం 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
- మరోవైపు, కాకినాడ జిల్లాలోనూ (Kakinada District) భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోటనందూరు మండలంలో అత్యధికంగా 3.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఏలూరు జలాశయం నిండుకుండలా మారగా.. దిగువకు 9,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 21 వేల క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. కిర్లంపూడి, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పెద్దాపురం, సామర్లకోట మండలాలకు ముప్పు పొంచి ఉండగా.. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా విశాఖలోని ఆంధ్రా వర్శిటీకి సెలవు ఇచ్చారు. సోమవారం జరగాల్సిన పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేశారు. అటు, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
- భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,17,270 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
అటు, అల్లూరి జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో పర్యాటకులు సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామని తెలిపారు. జలపాతం ఉగ్రరూపంతో ఉరకలు వేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తుండగా నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ మరో 20 ఏళ్లే పని చేస్తుంది- ఏబీపీ దేశంతో కన్నయ్య సంచలన కామెంట్స్