Ongole MP Magunta Srinivasa Reddy Resign: ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. గత కొద్ది రోజులుగా వైసీపీ అధిష్ఠానం నిర్ణయాల పట్ల మాగుంట అసమ్మతితో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ కూడా ఒంగోలు ఎంపీ టికెట్ ను ఈసారి ఆయనకు నిరాకరించింది. దీంతో మాగుంట పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఎంపీ మాగుంట రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరతారని తెలుస్తోంది. నేడో రేపో చంద్రబాబును కలిసే అవకాశం ఉందని సమాచారం.


బుధవారం ఉదయం మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందని అన్నారు. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు వచ్చి 33 సంవత్సరాలు గడిచిందని గుర్తు చేసుకున్నారు. ఎనిమిది సార్లు పార్లమెంట్, రెండు సార్లు అసెంబ్లీ, ఒకసారి ఎమ్మెల్సీగా తాను పోటీ చేశామని గుర్తు చేసుకున్నారు. మాగుంట కుటుంబానికి అహం లేదు.. ఆత్మగౌరవం ఉందని.. గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 11సార్లు తాను ఎన్నికల బరిలో నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. ‘‘మా ఇంటికి బీదవాడు వచ్చినా, ధనిక వ్యక్తి వచ్చినా ఒకే ట్రీట్మెంట్ ఉంటుందని అందరూ అంటారు. మాగుంట కుటుంబానికి బాగా ఆత్మగౌరవం ఉంది. ఇగో లేదు. ప్రతి ఒక్కరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది’’ అని అన్నారు.


వచ్చే ఎన్నికల్లో కుమారుడిని బరిలోకి
వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడని ఆయన ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నామని అన్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తనకు జగన్ మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఈ సందర్బంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.


సీటు గల్లంతు చేసిన వైసీపీ
వైసీపీ అధిష్ఠానం ఒంగోలులో సిట్టింగ్ ఎంపీ అయిన మాగుంటని ఈసారి దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీఎం జగన్ తెరపైకి తెచ్చారు. వైసీపీలో పరిణామాలపై మాగుంట శ్రీనివాసుల రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. మార్చి మొదటి వారంలో మాగుంట టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.