Lorry Ran Over The Sisiters in Eluru: రాష్ట్రంలో పండుగ పూట రోడ్డు ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో ఘోర విషాదం నింపాయి. వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు (Eluru) జిల్లా మండవల్లి (Mandavalli) మండలం కానుకొల్లులో విషాదం జరిగింది. ఇంటి ముందు ముగ్గులు వేస్తోన్న అక్కాచెల్లెళ్లపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన టీడీపీ నేత పంగిళ్ల నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అదే సమయంలో గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న ఇటుకల లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని (16) మృతి చెందగా.. పల్లవీ దుర్గకు (18) గాయాలయ్యాయి. బాధితురాలిని గుడివాడలోని (Gudivada) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ ప్రకాశ్ రావును అదుపులోకి తీసుకున్నారు. నాగబాబు కుమార్తె మృతితో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కానుకొల్లుకు చేరుకున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తేజస్విని, పల్లవీ దుర్గ ఇద్దరూ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు.
తిరుపతిలో ఘోర ప్రమాదం
తిరుపతి జిల్లాలోనూ ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొరవారి సత్రం (Doravari Satram) మండలం కలగుంట వద్ద జాతీయ రహదారిపై బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాయుడుపేట నుంచి రహదారిపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతులు మునిరాజా (24), రాంకీ (25), గౌతమ్ (23)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అటు, కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ లో పెట్రోల్ కొట్టించుకుని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తానేటి హరీష్ (22), గోవింద్ (22) గా గుర్తించారు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: AP Politics: దువ్వాడకు జగన్ మరోసారి ఆఫర్! కింజరాపుకోటలో పాగా వేయడం అసలు సాధ్యమేనా?