Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలానికి ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందంతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెళ్లారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైలు ప్రమాదంలో 178 మంది తెలుగు వాళ్లు ఉన్నారని తెలిపారు. మృతులు, గాయపడిన వారు, మిస్సైన వారి వివరాల కోసం అధికారులు చాలా కష్టపడుతున్నారని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అవసరం అనుకుంటే ఎయిర్ లిఫ్ట్ చేయమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అదేశించారని వివరించారు. రాష్ట్రానికి చెందిన వైద్యుల బృందాన్ని క్షతగాత్రులకు చికిత్స అందించడానికి పంపామని చెప్పారు. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు పని చేస్తున్నాయని వివరించారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 మంది కాంటాక్ట్ లోకి వచ్చారని తెలిపారు. మిగిలిన ఐదుగురి ఫోన్ లు స్విచ్ఛాఫ్ లో ఉన్నాయని, మరో ఇద్దరి ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తున్నాయన్నారు. మొబైల్ ఫోన్లకు స్పందించని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.  


అలాగే జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాని తెలిపారు. శ్రీకాకుళం పరిసర జిల్లాలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, అంబులెన్సులను ఘటనా స్థలానికి పంపించాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడబోమని సీఎం చెప్పారన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 104, 108 వాహనాలతో పాటు వైద్యులను కూడా తరలిస్తున్నామని వివరించారు. 


హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి


మరోవైపు ఒడిశా రైలు ప్రమాద ఘటన పై రాష్ట్ర హోం మంత్రి  డాక్టర్ తానేటి వనిత  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరం, బాధాకర అయిన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వివరించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే క్షేత్ర స్థాయిలో సహాయక చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని బృందాలను ఘటనాస్థలికి పంపామమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణీకుల సంబంధించిన వివరాలను అధికారుల బృందాలు సేకరిస్తున్నాయన్నారు.  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారుల ముమ్మర చర్యలు చేపట్టారన్నారు. 


జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశామని మంత్రి తానేటి వనిత అన్నారు. రైలు ప్రమాదంలోని క్షతగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ రాష్ట్ర స్థాయి అత్యవసర ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ ఎర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఆ నెంబర్లు - 1070, 112, 18004250101 గురించి కూడా వెల్లడించారు. మీ బంధువులో స్నేహితులో కనిపించకుండా పోతే సమాచారం కోసం 8333905022 నెంబర్ కు ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేయమని సూచించారు. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని ప్రజలకు వివరాలు వెల్లడిస్తామని హోమంత్రి తానేటి వనిత వెల్లడించారు.