AP Latest News: ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నాయకుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితుడ్ని గుర్తించారు. జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేటకు వైసీపీ కార్యకర్త గింజుపల్లి శ్రీనివాసరావుపై గత రాత్రి 11 గంటల సమయంలో హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థులు కారుపై దాడి చేసి అతణ్ని తీవ్రంగా గాయపర్చారు. దీంతో స్థానికులు శ్రీనివాసరావును జగ్గయ్యపేట గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.


దాడి జరిగిన ఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాడి చేసిన నిందితులను గంట వ్యవధిలోనే విజయవాడలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


రాత్రి వేళ భోజనం చేసేందుకు హోటల్ వద్దకు వెళ్లగా వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై దాడి జరిగింది. బ్లాక్ కలర్ స్కార్పియోలో టీడీపీ నేతగా భావిస్తున్న చింతా వెంకటేశ్వరరావు అలియాస్ బుల్లబ్బాయ్ సహా మరో ఐదుగురు ఈ దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావుపై కర్రలతో విరుచుకుపడ్డారు. దాడి అనంతరం కారును ధ్వంసం చేశారు. శ్రీనివాసరావుపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన మరో ఇద్దరి పైనా టీడీపీ గూండాలు దాడి చేశారు. శ్రీనివాసరావుతో పాటు మిగిలిన ఇద్దరిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. 2009లో శ్రీనివాసరావు తండ్రి వీరయ్య హత్య కేసులో టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.