NRI Pemmasani Chandrasekhar to be TDP candidate from Guntur Lok Sabha :  గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఖరారయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  తెనాలి మండలం బుర్రిపాలేనికి చెందిన చంద్రశేఖర్‌ తండ్రి వ్యాపార రిత్యా నర్సరావుపేటలో స్థిరపడ్డారు. చంద్రశేఖర్‌ 1993-94లో ఎంబిబిఎస్‌ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సాధించారు. తరువాత మెడికల్‌లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్‌గా పని చేశారు.  


అమెరికాలో యూ వరల్డ్ అనే కంపెనీ ఓనర్                             


విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌లైన్‌ శిక్షణా సంస్థను ప్రారంభించారు. నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో సైతం అమెరికాలో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఏర్పాటు చేశారు. అమెరికా ఫీజిషియన్‌ అసోసియేషన్‌లో సభ్యులుగా పలు సేవలందించారు. పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచితవైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్యలను తెలుసుకున్న ఆయన 120 బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. తెనాలి మండలం బుర్రిపాలెంలోనూ ఉచిత ఆర్‌వో ప్లాంటు నెలకొల్పారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌ బులిటీ కింద విద్యా సేవలు అందిస్తున్న పలు సంస్థలకు సాయం అందించారు. 


గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీకి ప్రయత్నం - టిక్కెట్ దక్కకపోవడంతో అమెరికాకు !                


2014లోనే టిడిపి నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. 2014, 2019లో మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంత కాలం వేచి ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. మంగళగిరి జనసేనపార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను చంద్రశేఖర్‌   కలిసి పలు అంశాలపై చర్చించారు. జనసేన, టిడిపి సమన్వయంతో పనిచేస్తాయని చంద్రశేఖర్‌కు వపన్‌ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా నేతల్ని సమన్వయం చేసుకునేందుకు అందర్నీ కలుస్తున్నారు. 
  
రాజకీయాలకు విరామం ప్రకటించిన గల్లా జయదేవ్               


రాజకీయ వేధింపుల వల్ల తన వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందని కొన్నాళ్లు విరామం ప్రకటించారు గల్లా జయదేవ్. ఆయనే పోటీ చేస్తానంటే కొత్త అభ్యర్థిని చూడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ గల్లా జయదేవ్ వైదొలగడంతో టీడీపీలో ఇతరులకు చాన్స్ రావడం ఖాయమయింది. బాష్యం రామకృష్ణ, లావు కృష్ణదేవరాయులు వంటి పేర్లు పరిశీలిస్తారని ఎక్కువ మంది అనుకున్నారు కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన పేరు మీడియాలోకి వచ్చే వరకూ చాలా మందికి తెలియదు.