Nara Lokesh Warning to 23 MLAs and two ministers: తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, మంత్రి నారా లోకేశ్ జోనల్ కో-ఆర్డినేటర్లతో మంగళవారం మంగళగిరిలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశం నిర్వహించారు. పార్టీపై నిర్లక్ష్యం, కార్యకర్తలను పట్టించుకోని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్, గ్రీవెన్స్ మీటింగులు నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు ఫార్మల్ నోటీసులు జారీ చేయాలని జోనల్ ఇన్‌చార్జ్‌లకు ఆదేశించారు.
మంత్రులు, ఎమ్మెల్యేల్లో నిర్లక్ష్యం వద్దని నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ న్యాయం చేయడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో, 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని, అంతకు ముందు అన్ని పెండింగ్ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నాయకులు కార్యకర్తలను, ప్రజలను విస్మరిస్తున్నారని లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ డేస్ నిర్వహించకపోవడం, ప్రజా దర్బార్‌లు ఏర్పాటు చేయకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యంమన్నారు. ఇలాంటి 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు గుర్తించామని.. వారికి జోనల్ కో-ఆర్డినేటర్లు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ఇది ముందస్తు హెచ్చరిక అని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది మంగళగిరి ప్రజా దర్బార్‌కు రావడం ఎందుకని ప్రశ్నించిన లోకేశ్, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో వారాంతాపు గ్రీవెన్స్ మీటింగులు నిర్వహించాలని, మంత్రులు కూడా టీడీపీ కార్యాలయం గ్రీవెన్స్ సెషన్లలో పాల్గొనాలని సూచించారు.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కార్యకర్తలను మరచిపోకూడదన్నారు. వారికి ప్రాధాన్యత, గౌరవం ఇవ్వడం మా బాధ్యత. ఈ బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. అని చెప్పుకొచ్చారు. జోనల్ కో-ఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార సారథి కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని, పెన్షన్ పంపిణీ స్వచ్ఛ అంధ్రా కార్యక్రమాలు, క్యాడర్ రివ్యూలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలపై వివరణాత్మక రిపోర్టులు సమర్పించాలని, నాయకత్వం రివ్యూ చేస్తుందని తెలిపారు.
ప్రజల సమస్యలు నియోజకవర్గ స్థాయిలోనే పరిష్కారం కావాలని నారా లోకేష్ భావిస్తున్నారు. అయితే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. దాని వల్ల వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నప్పుడు వస్తున్నారు.