Andhra Pradesh CEO Mukesh Kumar Meena: అమరావతి: ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారం (ఏప్రిల్ 18) నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులు ఆయా కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్ధి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.
నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్ధితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతి ఇస్తారని, మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపివేస్తారన్నారు. అభ్యర్ధితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్ధులు పార్లమెంటుకు రూ.25,000, అసెంబ్లీకి రూ.10,000 ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు దీనిలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నామినేషన్ ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్ధులు ప్రవేశించే ద్వారాల వద్దా సిసి కెమేరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్ధుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారు.
ఎన్నికల ప్రక్రియ షెడ్యూలు మరియు ముఖ్యమైన తేదీలు:
-గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ: 18 ఏప్రిల్ 2024 (గురువారం)
-గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.
-నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : 25 ఏప్రిల్ 2024 (గురువారం)
-నామినేషన్ల పరిశీలన తేదీ: 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
-అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2024 (సోమవారం)
-పోలింగ్ తేదీ: 13 మే 2024 (సోమవారం)
-కౌంటింగ్ తేదీ : 04 జూన్ 2024 (మంగళవారం)
-ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ : 06 జూన్ 2024 (గురువారం)