ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ మద్యం అమ్మకాల గురించి కీలక వ్యాఖ్యల చేశారు. రాష్ట్రంలో ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయో వివరాలు బయటపెట్టారు. ప్రభుత్వం ఆయా కంపెనీల వివరాలు చెప్పడం లేదు కాబట్టే తాము  వివరాలను బయటపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కంపెనీల పేర్లు గతంలో బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి స్పందనలేదని తెలిపారు. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ వద్ద 100 కంపెనీలు నమోదు అయ్యాయని అందులో 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని వెల్లడించారు. తాజాగా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.


రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై బీజేపీ ఎలాంటి దర్యాప్తు చేపట్టినా తమకు అభ్యంతరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్రం అనుమతితోనే రాష్ట్రం అప్పులు తీసుకుంటోందని.. ఆ విషయంలో ఏవైనా అక్రమాలు జరిగితే సంబంధిత మంత్రిత్వ శాఖ స్పందిస్తుందని బొత్స పేర్కొన్నారు.


రాష్ట్రంలో గత కొంత కాలంగా మద్యం అక్రమ అమ్మకాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పెద్దలను లక్ష్యంగా చేసి మరీ ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లో మద్యం అమ్మాకాలు  జరుగుతున్నాయని ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రజలతో పాటుగా వివిధ మద్యం దుకాణాల వద్దకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. అమ్మకాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా... ఆ ప్రాంతంలో జరిగే అక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశంపై పురందేశ్వరి తాజాగా... కేంద్ర పెద్దలను సైతం కలిశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు.


కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రుణాలు


పురందేశ్వరి ఆరోపణల నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై బీజేపీ ఎలాంటి దర్యాప్తు చేపట్టినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. రుణాలన్నీ కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే తీసుకుంటున్నట్లు బొత్స వెల్లడించారు. అలాంటప్పుడు., ఏవైనా తప్పులుంటే సంబంధిత మంత్రులు స్పందిస్తారు కదా..? అంటూ వెల్లడించారు. విజయనగర ఉత్సవాలపై కలెక్టరేట్ లో జరిగిన "కర్టెన్ రైజెర్ ఈవెంట్" కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.


చంద్రబాబు అవినీతి చేశాడన్నది నిజం


నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి  కార్యక్రమంపై బొత్స మాట్లాడుతూ... తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై కూలంకషంగా విచారణ జరగాలని కోర్టులు చెప్తున్నాయని వెల్లడించారు. చంద్రబాబు అవినీతి చేశాడన్నది నిజమని బొత్స తెలిపారు. నిజం గెలవాలి అనే కార్యక్రమానికి ఆ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేన కలయికపై మంత్రి స్పందిస్తూ... 'టీడీపీ- జనసేన వ్యాక్సిన్' వారి మనుగడ కోసమే అంటూ విమర్శలు గుప్పించారు. ఆ వాక్సిన్ తో వైసీపీకి ఎటువంటి నష్టం ఉండదని బొత్స ధీమా వ్యక్తం చేశారు.


కరువు పరిస్థితులపై చర్చిస్తున్నాం


రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై బొత్స స్పందించారు. తాజా పరిస్థితులపై ఎక్కడికక్కడ అధికారులతో చర్చిస్తున్నామన్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వర్షాభావం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరవు నివారణపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి బొత్స తెలిపారు.