NIA Court :  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ సందర్భంగా జరిగిన  విచారణలో ఎన్ఐఏ  బాధితుడిని నేటి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది సలీమ్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే్  స్టేట్‌మెంట్ రికార్డు చేశామని ఎన్‌ఐఏ న్యాయవాది చెప్పారు. రికార్డు చేస్తే చార్జ్‌షీట్‌లో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను.. విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడు కూడా  కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు.


సాక్షుల స్టేట్‌మెంట్లు లేకపోవడంపై ప్రశ్నించిన న్యాయమూర్తి 


56 మందిని ఈ కేసులో విచారిస్తే 1 నుంచి 12 వరకూ ఉన్నవారి స్టేట్‌మెంట్లు.. చార్జ్‌షీట్లో లేకపోవడంపై న్యాయమూర్తి ఎన్ఐఏ న్యాయవాదిని ప్రశ్నించారు.  ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. కోర్టుకు బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్డి స్పష్టం చేశారు.   దీంతో  బాధితుడైన సీఎం జగన్ కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎన్ఐఏ కేసులు చాలా కఠినంగా ఉటాయి. అంత తేలికగా బెయిల్ కూడా దొరకదు. అందుకే నాలుగేళ్లుగా శ్రీనివాస్ జైల్లోనే ఉంటున్నారు. ఆయనకు బెయిల్ కోసం ఇటీవల ఆయన తల్లిదండ్రులు సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. 


కోడికత్తి కేసులో అసలేం జరిగిందంటే ?


2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్‌..సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది.  చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత   సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది. 


2019లోనే చార్జిషీటు దాఖలు చేసిన  ఎన్ఐఏ 


ఏపీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న ద‌ర్యాప్తు మీద త‌మ‌కు అనుమానాలు ఉన్నాయని హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ వేయడంతో కేసును కోర్టు ఎన్ఐఏకు ఇచ్చింది.  విచారణ జరిపిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది.  ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు.   ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించకూడదని అప్పట్లో ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.