రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందో లేదో సెప్టెంబర్ 8వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై బెంచ్ తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నై NGT ధర్మాసనం విచారణ జరిపింది. ప్రాజెక్టు పనులపై స్టే ఉన్పన్పటికీ ఎపీ ప్రభుత్వం నిర్మిస్తోందని శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖతో పాటు కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. అనేక వాయిదాల తర్వాత ఇటీవల ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి ఎన్జీటీకి కేఆర్ఎంబీ కమిటీ నివేదిక సమర్పించింది. 


కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాత తీర్పు 


అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో జరిగిన పనుల వల్ల ఎలాంటి పర్యావరణ ప్రభావం ఉంటుందో చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను కేంద్రం ఆదేశించింది.   నివేదిక ఇచ్చేందుకు సమయం కావాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 8వ తేదీ వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీటీ తెలిపింది. సెప్టెంబర్ 8వ తేదీన అన్ని అంశాలు పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పనులు జరిగినట్లుగా ఉంటే ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలోనే ఎన్జీటీ హెచ్చరించింది. గతంలో కోర్టు ధిక్కరణ కింద ఎవరికైనా శిక్షలు వేశారా అన్న అంశంపై వివరాలు సమర్పించాలని ఎన్జీటీ పిటిషనర్లను ఆదేశించింది. 


పనులు చేపట్టలేదని మరోసారి ఏపీ సర్కార్ అఫిడవిట్ 


అయితే ఈ లోపు ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. అక్కడ జరిగిన పనులు  సెంట్రల్ వాటర్ కమిషన్ అనుతుల కోసం అవసరమైనవి మాత్రమేనని తెలిపింది.ఆ ప్రదేశంలో యంత్రాలు లేవని, కార్మికులు కూడా లేరని పనులేమీ జరగడం లేదనితెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు జాయింట్‌ కమిటీ పేర్కొనలేదని ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ను ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వ వాదనను పిటిషనర్ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. నివేదికను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. 


వెలుగొండకు నిధులివ్వవద్దని తెలంగాణ లేఖ


మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులు కేటాయింపుపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగా ప్రభుత్వం లేఖ రాసింది.  వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవనితె...కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో కూడ ఈ ప్రాజెక్టును నోటిఫై చేయలేదని కూడ తెలంగాణ సర్కార్ గుర్తు చేసింది.  అనుమతి లేని ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం సరైంది కాదని  కూడ తెలంగాణ సర్కార్ అభిప్రాయపడింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అంతకంతూ పెరుగుతున్నాయి. పదే పదే కేంద్రానికి రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తున్నాయి.