Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని ఎన్‌జీటీ తీర్పు వెలువరించింది. పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు ఆధ్వర్యంలో ఇసుక దందా నడుస్తోందని.. ఆయన అనుచరుడు నాగేంద్రకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తీర్పులో పేర్కొన్న ఎన్జీటీ గత ఉత్తర్వులు అరణియార్‌ నదిలోని 18 రీచ్‌లకే పరిమితం కాదని స్పష్టం చేసింది. 


రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు చేయాలన్నఎన్జీటీ సూచించింది. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని ఆదేశించింది. గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పునకు ఏపీ ప్రభుత్వం వక్రభాష్యం చెప్పిందని మండిపడింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఆదేశాల తర్వాత ఇసుక తవ్వకాలపై నివేదించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై జేపీ వెంచర్స్‌ కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.  


ఎవరీ నాగేంద్ర కుమార్?


పల్నాడు జిల్లా ధరణి కోటకు చెందిన వైసీపీ నాయకుడు దండా నాగేంద్ర కుమార్ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అనుచరుల్లో ఒకరు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై గతంలో జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన ఎన్‌జీటీ.. ఇసుక తవ్వకాలు ఆపాలని, జరిమానాలు విధించాలని ఆదేశించింది. ఐతే ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశాలతోనే తాను ఎన్‌జీటీని ఆశ్రయించానని నాగేంద్ర కుమార్‌ వివరించారు. గతంలో జేపీ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే.. ఇప్పుడు తానే తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా.. జేపీ వెంచర్స్ ప్రతినిధుల్ని ఎమ్మెల్యే బెదిరించిన వీడియోలను ఆయన బయటపెట్టారు.


‘నన్ను లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు’


ఎమ్మెల్యే ఆ రోజు తనను భయపెట్టి కేసు పెట్టించారని.. తరువాత ఆయన పెంపుడు కొడుకు నంబూరి కల్యాణ చక్రవర్తి తనపై దాడులు చేస్తానని, భౌతికంగా లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని నాగేంద్ర కుమార్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును వాపస్​ తీసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చారని కానీ తాను వాటికి తలవంచనన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని, ఈ క్రమంలో తన ప్రాణాలు పోయినా భయపడనని అన్నారు.


ఆధునిక యంత్రాలతో ఇసుక తవ్వకాలు


కేంద్ర ప్రభుత్వం ప్రకారం 25 హెక్టార్ల లోపు ఉన్న వాటికి మాన్యువల్​గా ఇసుక తీయాలని, భారీ పరికరాలు వాడకూడదన్నారు. కానీ రాష్ట్రంలో 5 హెక్టార్ల లోపు హెవీ మెకానైజైడ్‌తో తవ్వుతున్నారని నాగేంద్ర కుమార్ ఆరోపించారు. నాగేంద్రకుమార్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే శంకరరావు అనుచరులు ఖండించారు. నాగేంద్రే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. నాగేంద్రకు చెందిన ఇసుక లారీలను.. ప్రజలు అడ్డుకున్నారంటూ కొన్ని ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial