News Districts in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో జరగబోతోంది. నిన్నటి వరకూ 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఏర్పడుతున్న మరో 13 జిల్లాలతో కలిపి 26 జిల్లాలతో పాలన సాగించనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 13 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. 1979 తర్వాత భారీగా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో పాత జిల్లాలకు మారిన సరిహద్దులు, నైసర్గిక స్వరూపాలతో కొత్త జిల్లాల ఉనికి నేటి నుంచి (ఏప్రిల్ 4) అమలులోకి రానుంది.


ముహూర్తం 9.05 గంటలకు..
ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభానికి సోమవారం (ఏప్రిల్ 4) ఉదయం 9.05 నుంచి 9.45 గంటల మధ్య ముహూర్తం పెట్టారు. ఈ కొత్త జిల్లాల ప్రారంభంపై ముఖ్యమంత్రి జగన్ వీసీ ద్వారా సందేశం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగానే జిల్లాల పునర్ విభజనపై సమగ్ర నివేదికను ప్రణాళిక సంఘం కార్యదర్శి ముఖ్యమంత్రికి అందిస్తారు. వెంటనే కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయి. ఇక కలెక్టరేట్లు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపీలో కొత్త జిల్లాల భౌగోళిక సరిహద్దులతో ఫ్రేమును అమర్చడంపై ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి.


నేడు బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్లు, ఎస్పీలు
కొత్త జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కొంతమంది ఎస్పీలు, కలెక్టర్లు విధుల్లో చేరారు. మిగిలిన చోట్ల ఉన్నతాధికారులు నేడు  బాధ్యతలు చేపట్టనున్నారు.


ఈ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, ఆర్డీవో, ఇతర డివిజన్‌ స్థాయి అధికారుల భౌగోళిక పరిధులు తగ్గిపోతాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటికే ఉన్నవారికి ట్రాన్స్‌ఫర్ ఉత్తర్వులు అందుకున్న అధికారులు తమకు కొత్తగా అపాయింట్ మెంట్ ఇచ్చిన చోటికి చేరుకుంటున్నారు. కొత్త జిల్లాలకు మారుతున్న తోటి ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతూ, ఉద్యోగులు గత రెండు మూడు రోజులుగా ఫేర్ వెల్స్ ఇచ్చుకుంటున్నారు. 


హామీ నెరవేరుస్తున్న జగన్
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన పాదయాత్ర హామీల్లో కీలక ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ప్రజలకు పాలన చేరువ చేసేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు అని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలు మారినా జిల్లా పరిషత్‌లలో మార్పు లేదని ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్రమంతటా ఒకే రిజిస్ట్రేషన్ కోడ్ ఉండటంతో వాహనాలు రిజిస్ట్రేషన్లలో మార్పు లేదని ప్రభుత్వం తెలిపింది. అన్ని జిల్లాల రవాణా శాఖకు AP 39 రిజిస్ట్రేషన్ కోడ్ ఉంది.


మొత్తానికి గత జనవరి 25న కొత్త జిల్లాలకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల అయింది. అనేక వర్గాల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనల తీసుకున్న తర్వాత తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు 68 రోజుల సమయం పట్టింది. ప్రణాళిక సంఘం, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, సాధారణ పరిపాలన విభాగం, ఆర్థిక శాఖలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాయి.