New Excise Policy in AP: రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం జరుగుతుందని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర సచివాలయం, 4వ బ్లాక్ లోని ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మైన్స్, జియాలజీ & ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. సెబ్ పేరుతో వ్యవస్థను విధ్వంసం చేశారు. 70 శాతం ఉద్యోగులను వారి అక్రమ మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా చేశారు. వారి సొంత బ్రాండులైన జె బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత దశల వారీగా మద్యం నియంత్రణ అంటూ మోసం చేశారు. దీంతో మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వారి జేబుల్లోకి వెళ్లిపోయింది.
నాసిరకం మద్యంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు
నాసిరకం మద్యం తాగి చాలామంది అనారోగ్యంపాలై మృత్యువాత పడ్డారు. కిడ్నీ సమస్యలు, పెరాలసిస్ వంటి సమస్యలతో మంచానపడ్డారు. డిస్టలరీస్ వ్యవస్థను కూడా వారి చేతుల్లోకి తీసేసుకున్నారు. గత ఐదేళ్లలో వారి అక్రమ మద్య విధానంపై ఎన్నో పోరాటాలు చేశాం. దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్య విధానంపై సీఎం ఆదేశాలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసి బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేసింది.
సెప్టెంబరుతో గత మద్యం పాలసీ క్లోజ్
అప్పట్లో 1994లో అమలు చేసిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దానిని ఆదర్శంగా తీసుకుని 6 రాష్ట్రాల్లో నూతన పాలసీపై అధ్యయనం చేశాం. అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ మద్యం షాపులు, ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నడుపుతున్న మద్యం షాపుల విధానాలను అధ్యయనం చేశారు. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందించేలా ప్రపోజల్స్ ను రేపు కేబినెట్ ముందు ఉంచుతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం విక్రయాలను నిలిపివేశాం. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో క్లోజ్ అవుతుంది. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ అలాగే జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది’’ అని అన్నారు.
రాష్ట్ర పౌర, సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘‘క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. మాకున్న అవగాహనతో కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో సహకరించాం. దీనికి ముందు మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో సమావేశమై చర్చించడం జరిగింది. రేపు కేబినెట్ ముందు నూతన లిక్కర్ పాలసీ ప్రపోజల్స్ ను పెడతాం. గత ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీతో జేబులు నింపుకోవడానికి ప్రయత్నించింది. విచిత్రంగా ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచుకుంటూ పోయారు’’ అని అన్నారు.