YSRCP MLA Prasanna: వారాహి యాత్రతో వైసీపీ నేతలు మళ్లీ పవన్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఇటీవల పవన్ పై వ్యక్తిగత విమర్శలు పెద్దగా వినిపించలేదు, ఏదో చెప్పుల గోల జరుగుతోంది. అయితే నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం పవన్ కల్యాణ్ వివాహాలను మళ్లీ ప్రస్తావించారు. అయితే ఆయన ఏకంగా పవన్ కి ఐదు పెళ్లిళ్లు చేశారు. పవన్ కల్యాణ్ కి ఐదుగురు భార్యలను, ఆయన ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. 


ఎమ్మెల్యే అయితే చాలు, తాను శాసన సభలో అడుగుపెడితే చాలు అని పవన్ అనుకుంటున్నారని, కేవలం చంద్రబాబుని సీఎం చేయడానికే ఆయన ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు ప్రసన్న. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ ఎంత విషప్రచారం చేసినా తమకేమీ నష్టం లేదన్నారు. జగన్ ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 


ఉమ్మడి రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారని.. ఆయన వాగ్దానాలన్నీ మరచిపోయారని చెప్పారు. చంద్రబాబు హయాంలో కోటీశ్వరులు కోటీశ్వరులుగానే ఉన్నారని, పేదవారు పేదవారుగానే ఉండిపోయారన్నారు. జగన్ హయాంలో పేదవారికోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. పేదవారిని పైకి తెచ్చేందుకే జగన్ ప్రయత్నించారన్నారు. అందుకే జగన్ ని మళ్లీ సీఎం చేయాలని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు ప్రసన్న. 


జగన్ ని కిందకు దించాలి, తాము ఆ కుర్చీలో కూర్చోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, ఆయనకు పవన్ తోడయ్యారని విమర్శించారు. వారిద్దరూ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు ప్రసన్న. దత్తపుత్రుడు పవన్ ఎన్ని వారాహి యాత్రలు చేసినా, ఎన్ని సభలు పెట్టి వైసీపీని తిట్టినా జగన్ వెంట్రుక కూడా పీకలేరని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారాయన. ఏదో విధంగా సీఎం జగన్‌ ని ఇంటికి పంపించాలని కొంతమంది విషప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఐదు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ వ్యవహారం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడమే పవన్ ఉద్దేశమని చెప్పారు ప్రసన్న. తాను ఎమ్మెల్యే అయితే చాలని ఆయన అనుకుంటున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. పవన్ పెళ్లిళ్ల వ్యవహారంపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 


ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తే తాము కూడా వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు బయటకు తీయాల్సి వస్తుందని కౌంటర్లిస్తున్నారు. అసలు పవన్ వివాహాల గురించి మాట్లాడే అర్హత ప్రసన్నకు లేదన్నారు. విధాన పరంగా పవన్ కి సమాధానం చెప్పలేక, సీఎం జగన్ ఇలా ఎమ్మెల్యేల చేత పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించేలా చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తమ్మీద వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీనిపై పవన్ కల్యాణ్ మరోసారి స్పందిస్తారేమో చూడాలి.