నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు అవరోధం ఎదురైన సంగతి తెలిసిందే. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వారిని ఇబ్బంది పెట్టారని, కనీసం బస చేయడానికి స్థలం కూడా ఎవరూ ఇవ్వకుండా అడ్డుకున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ఎపిసోడ్ పై, తనపై వచ్చిన విమర్శలపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. అమరావతి పాదయాత్రను అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని, అయితే అది పాదయాత్ర కాదని ఓ రాజకీయ యాత్ర అని విమర్శించారు.
న్యాయస్థానం.. దేవస్థానం.. మధ్య రాజకీయ ప్రస్థానం..
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర మొదలు పెట్టిన రైతులు మధ్యలో రాజకీయ ప్రస్థానం ఎందుకు మొదలు పెట్టారని ప్రశ్నించారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. యాత్రను తాము తప్పుట్టడం లేదని, కానీ మధ్యలో టీడీపీ నేతలు ఎంటరై.. ఆ యాత్ర స్వరూప స్వభావాలనే మార్చేశారని మండిపడ్డారు.
శని ఎంటరయ్యాడు..
నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల యాత్రకు ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదని, సర్వేపల్లి నియోజకవర్గంలోకి యాత్ర అడుగు పెట్టగానే శనిరూపంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంటరయ్యారని, అందుకే వారు కష్టాలు పడ్డారని సెటైర్లు వేశారు. సోమిరెడ్డి మొహం చూసి ఎవరూ వారికి బస చేయడానికి స్థలం ఇవ్వలేదని, అది సోమిరెడ్డి ఫేస్ వేల్యూ అని, దానికి తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు.
ఆ భ్రమ ఉంటే జీవితంలో అమరావతి రాదు..
అమరావతి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని వారి అనుకూల మీడియాలో రాస్తున్నారని, అది అవాస్తవం అని అన్నారు ఎమ్మెల్యే కాకాణి. పూలవర్షం కురిపించారని అనడం సరికాదని.. నెల్లూరు నుంచి ట్రాక్టర్ లో పూలు తెచ్చుకుని వారిపై వారే పూలవర్షం కురిపించుకుంటున్నారని, అన్నారు.
600మందికంటే ఎక్కువమంది ఉంటే నేను రిజైన్ చేస్తా..
అమరావతి యాత్రలో జనం కూడా ఎక్కువమంది లేరని, కనీసం 600 మంది కూడా లేరని అన్నారు. అమరావతి యాత్రలో అంతకంటే ఎక్కువమంది ఉన్నారని రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
వరదబాధితుల కష్టాలు పట్టవా..?
నెల్లూరు జిల్లాలో వరద బాధితులు కష్టాలు పడుతుంటే.. టీడీపీ నాయకులు వారికి కనీసం రూపాయి కూడా సాయం చేయలేదని, కేవలం అమరావతి రైతులకు మాత్రం విరాళాలు ఇస్తున్నారని అన్నారు. అమరావతి యాత్రకు సాయం చేసేవారు, వరదబాధితులకు ఎందుకు సాయం చేయరని నిలదీశారు. తమకు రైతులన్నా, మహిళలన్నా గౌరవం ఉందని.. తామెక్కడా యాత్రను అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. దేవస్థానం వెళ్లేవారు శాపనార్థాలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.