నాపై పోటీకి పెట్టే ఖర్చు రూ. 150కోట్లు- టీడీపీ అభ్యర్థి నారాయణపై అనిల్ సీరియస్ కామెంట్స్

తనపై పోటీకి దిగాలని నారా లోకేష్ కి తాను సవాల్ విసిరానని, కానీ దానికి ఆయన భయపడ్డారని, తానొక వెర్రి పుష్పం అని నిరూపించుకున్నారని సెటైర్లు పేల్చారు అనిల్.

Continues below advertisement

నెల్లూరు ఫైట్ ఎవరెవరి మధ్యో తేలిపోయింది. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా నారాయణ పేరు ఖరారైంది. దీంతో వెంటనే నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ స్పందించారు. నారాయణపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన పక్కా బిజినెస్ మేన్ అని, ఎన్నికలైపోయిన తర్వాత ప్రజల్ని పట్టించుకోరాన్నారు. ఓడిపోయిన తర్వాత నాలుగున్నరేళ్లు ఇప్పుడు ఆయన తిరిగి పోటీ కోసం నెల్లూరుకి రావడమేంటని ప్రశ్నించారు అనిల్. 

Continues below advertisement

నెల్లూరు సిటీకి మాజీ మంత్రి నారాయణను అభ్యర్థిగా టీడీపీ ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ ప్రకటన వచ్చీ రాగానే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ ప్రెస్ మీట్ పెట్టారు. నాలుగున్నరేళ్లు నెల్లూరు సిటీకి దూరంగా ఉన్న నారాయణ తనపై పోటీ కోసం 150కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని అన్నారు అనిల్. అయితే ఆ ఖర్చు ఆయన జేబులో నుంచి పెట్టట్లేదని, పిల్లల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణ విద్యాసంస్థల్లో చదివే 5లక్షలమంది విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్నారని. అలా 150కోట్లు సేకరించి తనపై పోటీకి దిగుతున్నారని చెప్పారు. ఆయన పక్కా బిజినెస్ మేన్ అని, రాజకీయాలను కూడా వ్యాపారంలో చూస్తున్నారని విమర్శించారు అనిల్. 

లోకేష్ భయపడ్డారా..?
తనపై పోటీకి దిగాలని నారా లోకేష్ కి తాను సవాల్ విసిరానని, కానీ దానికి ఆయన భయపడ్డారని, తానొక వెర్రి పుష్పం అని నిరూపించుకున్నారని సెటైర్లు పేల్చారు అనిల్. తనను నెల్లూరు సిటీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించకపోయినా తాను ఓటమిని ఒప్పుకునే వాడినని, ఇప్పటికైనా లోకేష్ కి మించిపోయిందేమీ లేదని, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా తనపై పోటీ చేయాలన్నారు. సిల్లీ బచ్చా, హాఫ్ బచ్చా అంటూ తనపై కామెంట్లు చేస్తున్న లోకేష్ కి పులకేశి, పప్పు వంటి పేర్లున్నాయని అన్నారు అనిల్. టీడీపీలో బీసీలను ఎవరైనా కామెంట్ చేస్తే, వెంటనే బీసీ కార్డు వాడతారని, కానీ తనకా అవసరం లేదని, తనపై లోకేష్ ఎన్ని విమర్శలు చేసినా నేరుగా ఎదుర్కొంటానన్నారు అనిల్. తాను రెండుసార్లు డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచానని, కానీ లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యారని అన్నారు. ఇటీవల ఓ మీటింగ్ లో నారా లోకేష్ తడబడుతూ మాట్లాడిన వీడియోని ప్రెస్ మీట్ లో చూపించారు అనిల్. రైతుల గాయాలపైన, గాయాలపైన అంటూ లోకేష్ తడబడ్డారని, గాయాలపై కారం చల్లారు అని సొంతగా మాట్లాడటం కూడా చేతగాని నాయకుడు లోకేష్ అని సెటైర్లు పేల్చారు. 

దండకాలు మొదలు..
ఇప్పటి వరకూ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ గా ఉన్న వ్యక్తి నారాయణ పేరు చెప్పి దండకాలకు పాల్పడ్డారని, ఆయన్ని తట్టుకోలేక రాష్ట్ర కార్యదర్శిగా పదవి ఇచ్చారని వెటకారం చేశారు అనిల్. గతంలో తనపై గెలిచేందుకు నారాయణ భారీగా డబ్బులు ఖర్చు పెట్టారని, ఈసారి కూడా నెల్లూరులో 150 కోట్లు కుమ్మరించడానికి రెడీగా ఉన్నారని అన్నారు. 

బాత్రూమ్ లో దాక్కుని చూశారా..?
ఇటీవల సీఎం జగన్ ని తాను కలసిన సందర్భంలో.. తనను ఆయన గెటౌట్ అన్నారని కొన్ని మీడియా చానెళ్లలో వచ్చిందని, వారేమైనా బాత్రూమ్ లో దాక్కొని విన్నారా అని ప్రశ్నించారు అనిల్. వచ్చే ఎన్నికల్లో జగన్ తనకి బుల్లెట్ దించుతారని కామెంట్లు చేస్తున్నారని, అసలు ఆయన ఎవరికి బుల్లెట్ దించుతారో వేచి చూద్దామని చెప్పారు. 

Continues below advertisement