సిల్లీ బచ్చా అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు అంతే ఘాటుగా బదులిచ్చారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. తాను సిల్లీ బచ్చాని అయితే తనని చూసి లోకేష్ ఎందుకంత భయపడుతున్నారని సెటైర్లు పేల్చారు. తాను సిల్లీ బచ్చాను కాదని, సెల్ఫే మేడ్ మ్యాన్ ని అని, తన తండ్రి, తాత ముఖ్యమంత్రులు కాదన్నారు. తండ్రి, తాత ముఖ్యమంత్రులు కావడం వల్లే లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యారని వెటకారం చేశారు. 


ఆంధ్ర రాష్ట్ర పులికేసి, ఆంధ్ర రాష్ట్ర ముద్దు పుప్పు నారా లోకేష్ అని సెటైర్లు పేల్చారు అనిల్ కుమార్ యాదవ్. లోకేష్ గ్రామసింహంలా సింహపురిలో అడుగు పెట్టారని అన్నారు. లోకేష్ తండ్రి చంద్రబాబు చేయలేని పనిని వైసీపీ హయాంలో చేసి చూపించామన్నారు. సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనుల్ని తమ హయాంలోనే పూర్తి చేశామని చెప్పారు అనిల్. తాను దొడ్డిదారిన మంత్రిని కాలేదని, జగన్ ఆశీస్సులతో బీసీ ఎమ్మెల్యేగా గెలిచి తొలి బీసీ మంత్రిని అయ్యానని చెప్పుకొచ్చారు. 


నందమూరి ఫ్యామిలీలో పుట్టడం వల్లే లోకేష్ నాయకుడు అయ్యారని, మంత్రి అయ్యారని, లేకపోతే కనీసం పంచాయతీలో వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు అనిల్. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి 110కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా గెలిచిన పిల్ల బచ్చాను నేను అంటూ చెప్పుకొచ్చారు అనిల్. 2024లో తనపై ఎలక్షనీరింగ్ చేసేందుకు 200కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 


దమ్ముంటే పోటీకి రా..
లోకేష్ కి దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు అనిల్. లోకేష్ పై పోటీ చేసి తాను ఓడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటానన్నారు. నా సవాల్ ని స్వీకరిస్తావా అని ప్రశ్నించారు. ఈ పిల్ల బచ్చాని చూస్తే ఎందుకు భయం అని అడిగారు. తాను సవాల్ విసిరితే ఆనం రామనారాయణ రెడ్డి ఆ విషయాన్ని అధిష్టానంపైకి నెట్టేశారని, ఆయన తెలివిగలవారు కాబట్టి పోటీ నుంచి తప్పుకున్నారని కామెంట్ చేశారు అనిల్. 2024లో తన గెలుపుని ఆపగలితే రా లోకేష్ అని ఆహ్వానించారు. అలా చేయలేకపోతే ఆయన లోకేష్ కాదు పులకేసి అని ఒప్పుకోవాలన్నారు. నాయుడుపేట లే అవుట్ తో తనకు 1 శాతం కూడా సంబంధం లేదన్నారు అనిల్. 


గత నాలుగు రోజులుగా నెల్లూరు రాజకీయాల్లో రాజీనామాల సవాళ్లు పెరిగిపోయాయి. నువ్వు రాజీనామా చెయ్, లేదు నువ్వే రాజీనామా చెయ్, దమ్ముంటే అక్కడి నుంచి పోటీ చెయ్, ఇక్కడి నుంచి పోటీ చెయ్ అంటూ నాయకులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా నారా లోకేష్ కూడా అనిల్ ని టార్గెట్ చేశారు. దీంతో అనిల్ నేరుగా ఇప్పుడు లోకేష్ ని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. నెల్లూరులో లోకేష్ పాదయాత్ర జగిరినన్ని రోజులు ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగాలే ఉంది...