Nellore Politics: తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ నడిచింది. చివరకు టీడీపీలో చేరేందుకు ఆయన ఓకే చెప్పేశారు. 


తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ నడిచింది. చివరకు టీడీపీలో చేరేందుకు ఆయన ఓకే చెప్పేశారు. 
మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఆనం. రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. శుక్రవారం రాత్రి చంద్రబాబుతో సమావేశమైనట్టు చెప్పారు. అన్ని విషయాలు చర్చించామని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రపై కూడా మాట్లాడుకున్నామని వివరించారు. 


ఈ ఉదయం నుంచి నెల్లూరు జిల్లాలో కీలక పరిణామాలు జరిగాయి. ఆనం రామనారాయణ రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీ అధినేత చెప్పిన సందేశాన్ని వారికి వినిపించారు. దీనిపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. అనంతరం టీడీపీలో చేరుతున్నట్టు అనం ప్రకటించారు. 


మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతారని ఆ పార్టీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. వైసిపి ప్రభుత్వానికి చుక్కలు చూపే మార్పు నెల్లూరులోనే మొదలైంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు కూడా పాదయాత్రలో పాల్గొంటారని సోమిరెడ్డి ప్రకటించారు. 


ఈనెల 13న నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ కానున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర పది నియోజకవర్గాల్లో సాగనుంది. ఇందులో పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరులో వస్తున్న మార్పు ఒక్క ఆ జిల్లాకే పరిమితం కాదని రాష్ట్రంలోనే వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


చాలా రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి టీడీపీకి ఓటు వేశారని ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే అంతక ముందు నుంచే వీళ్లంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అవకాశం కోసం చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలను అవకాశంగా తీసుకొని వారిపై వేటు వేసింది. వైసీపీ అధినాయకత్వంపై వీళ్లంతా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ ఫోన్‌లను ట్యాప్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తమకు పార్టీలో ప్రాధాన్యత లేదని కూడా విమర్సలు చేశారు. 


సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నెల్లూరు రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రామనారాయణ రెడ్డి విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. అయితే అక్కడ ప్రాధాన్యత లభించలేదని వైసీపీలో చేరారు. వైసీపీ టికెట్‌పై పోటీ చేసి 2019లో విజయం సాధించారు. ఇప్పుడు అక్కడ కూడా ప్రాధాన్యత లేదని మళ్లీ సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు.