నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ ముగింపు దశకు చేరుకుంది. గంధ మహోత్సవం తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో దర్గాకు తరలి వస్తున్నారు. వరుసగా రెండేళ్లపాటు కరోనా వల్ల రొట్టెల పండగ జరగలేదు. మూడో ఏడాది ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడంతో పండగ సజావుగా జరిగింది. ఈ రొట్టెల పండగలో పాల్గొన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సజావుగా సాగాలని కోరుకుంటూ రొట్టెలు మార్చుకున్నారు. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, వైసీపీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సీఎం జగన్ ఆధ్వర్యంలో రెండోసారి మరిన్ని స్థానాల్లో వైసీపీ గెలిచి 2024లో అధికారంలోకి రావాలని కోరుకున్నారు నేతలు. ఆ కోరికల రొట్టెలను మార్చుకున్నారు. 




బారాషహీద్ దర్గా రొట్టెల పండగకు ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఆశించినా.. ఆ స్థాయిలో జనాలు రాలేదని తెలుస్తోంది. పోలీసులు ముందు జాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తుల తోపుటాలకు అవకాశం లేకుండా చేశారు. రొట్టెల పండగకు ముందు రెండు రోజులు, పండగ పూర్తైన తర్వాత వారం రోజుల వరకు భక్తుల తాకిడి ఉంటుంది. కానీ ఈసారి పండగ నాలుగోరోజు రష్ కాస్త తగ్గింది. ఐదోరోజు భక్తుల సంఖ్య మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. 


గతంలో గంధమహోత్సవం రోజే రొట్టెల పండగ జరిగేది, ఆ తర్వాత అది మూడురోజుల పండగా మారింది. ఇప్పుడు ఐదురోజుల పండగగా నిర్వహిస్తున్నారు. పవిత్ర గంధాన్ని సమాధులపై లేపనం చేసి, ఆ తర్వాత ఆ గంధాన్ని స్వర్ణాల చెరువులో కలిపిన అనంతరం రొట్టెల పండగ అధికారికంగా మొదలైనట్టు భావించాలి. ఈ ఏడాది కూడా భక్తులు రొట్టెల పండగ మొదటి రెండు రోజులు భారీగా వచ్చారు. గంధ మహోత్సవం తర్వాత జనం పలుచబడ్డారు. 


నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్పొరేషన్ నాయకులు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి శాంతి భద్రతల అంశాన్ని పరిశీలించారు. వృద్ధులు, మహిళలకు చెరువులో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పగడ్బందీగా పండగ నిర్వహించారు. నెల్లూరులో రొట్టెల పండగ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చారు. ఇతర రాష్ట్రాలనుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు నెల్లూరుకి తరలి వచ్చారు. నాలుగురోజులపాటు నెల్లూరులో వ్యాపారాలు కూడా జోరుగా సాగాయి.