నెల్లూరు రొట్టెల పండగ ప్రభుత్వ ప్రచారం చేసుకున్నంత గొప్పగా జరగలేదని విమర్శించారు టీడీపీ నేతలు. పండగ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రొట్టెల పండగలో పాల్గొన్న టీడీపీ నేతలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడాలని ఆకాంక్షిస్తూ రొట్టెలు మార్చుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ రొట్టెలు మార్చుకున్నారు, దర్గాలో ప్రార్థనలు చేశారు. 2024 ఎన్నికల్లో తమ నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడాలని ఆకాంక్షిస్తూ రొట్టెలు మార్చుకున్నట్టు తెలిపారు టీడీపీ నాయకులు. 




రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని, అన్ని రంగాల్లో దోపిడీ దౌర్జన్యాలు జరుగుతున్నాయని విమర్శించారు టీడీపీ నేతలు. ఎందరో వీరుల పోరాటంతో మనకు స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని, వైసీపీ పాలనలో మూడేళ్లలోనే రాష్ట్ర ప్రజలు ఎవరూ స్వతంత్రంగా బతికే పరిస్థితులు లేవని అన్నారు. ప్రజలంతా పోలీసుల దయాదాక్షిన్యాలపై బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఆయనపై ఉంటాయని తాము నమ్ముతున్నట్టు తెలిపారు. 


వైసీపీ నేతలు ఏ పని చేసినా అందులో నీతి నిజాయితీ కరువవుతున్నాయని, దానికి మరో ఉదాహరణే రొట్టెల పండగ అని అన్నారు అబ్దుల్ అజీజ్ రొట్టెల పండుగకు రాష్ట్ర పండుగగా తమ హయాంలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. కొంత సమయం ఉంటే.. జాతీయ పండగగా గుర్తింపు తెచ్చేవారిమని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చేవారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టీడీపీ హయాంలో 120 శాశ్వత టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. బారాషాహిద్ దర్గా అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి, 8 కోట్ల రూపాయలతో ఇస్లామిక్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని దాదాపు రెండు కోట్ల రూపాయలతో పిల్లర్లు వేసిన తర్వాత కూడా వైసీపీ వారు ఆ పనిని అర్ధాంతరంగా ఆపేసారని విమర్శించారు. 


వైసీపీ వచ్చిన మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని, స్థానిక ఎమ్మెల్యే కాగితం పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ 15కోట్లు మంజూరు చేశామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. దేవుడి విషయంలో రాజకీయాలు చేయటం సరికాదని టీడీపీ హయాంలో చేసిన పనులు ఆపేయడం సరికాదని హితవు పలికారు. గగతంలో టీడీపీ హయాంలో రొట్టెల పండుగ నిర్వహించినప్పుడు ఏడాదికి 16.5 లక్షల మంది వచ్చినట్లు రికార్డ్ ఉందని, ఈ ఏడాది వైసీపీ హయాంలో కనీసం మూడు నాలుగు లక్షల మంది వచ్చిన దాఖలాలు కూడా లేవని అన్నారు.


దర్గాలో భక్తులకంటే పోలీసులు ఎక్కువమంది కనిపిస్తున్నారని అన్నారు. దేవుడి కార్యం మంచి మనసుతో నిర్వహించాలని, కుతంత్రాలతో నిర్వహిస్తే ఇలానే ఉంటుందని విమర్శించారు. ప్రజలు కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదని తెలిపారు. దుకాణదారులు ప్రజలు రాక, తమకి వ్యాపారాలు గిట్టుబాటు కాక నష్టపోయామని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాతిగాంచిన ప్రదేశంగా బారాషాహిద్ దర్గాను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి, అజీజ్ తో పాటు.. కోవూరు నియజకవర్గ ఇన్ ఛార్జి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి నియోజకవర్గం ఇన్ చార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జెన్ని రమణయ్య, మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజా నాయుడు పాల్గొన్నారు.