నిన్న మొన్నటి వరకు జై కొట్టిన నోటితోనే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను కొందరు ఛీ కొడుతున్నారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత ఈ చీదరింపులు, చీవాట్లు మరింత ఎక్కువయ్యాయి. నెల్లూరు జిల్లాలో తొలిసారిగా పార్టీకి దూరంగా జరిగారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇన్ చార్జ్ గా ప్రకటించారు. ఆ తర్వాత పెద్దగా ఆనంపై ఆగ్రహ జ్వాలలేవీ బయటపడలేదు. ఇటీవల ఆనంను కూడా పార్టీనుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయనపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరిగింది.
నిన్న మొన్నటి వరకు ఆనంకు జై కొట్టినవారే ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెంకటగిరిలో ఆనం వర్గంగా ఉన్నవారంతా ఇప్పుడు రివర్స్ అయ్యారు. ఆనం కూడా దాదాపుగా వెంకటగిరిని పట్టించుకోవడం మానేశారు. వచ్చేసారి ఆయన, ఆత్మకూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసే ఆలోచనలో ఉండటంతో వెంకటగిరిలో ఏం జరుగుతున్నా పెద్దగా దృష్టి సారించడంలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటగిరిలో ఈరోజు పెద్ద కార్యక్రమం చేపట్టారు. నలుగురు సస్పెండైన ఎమ్మెల్యేల కటౌట్లు తయారు చేయించి, వాటిని కైవల్య నదిలో నిమజ్జనం చేశారు.
ఆ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు. ఇప్పటికే ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గంలో నలుగురు ఎమ్మెల్యేల కటౌట్లను తయారు చేయించి వాటిని కైవల్యా నదిలో పడేశారు. వారికి పిండప్రదానం చేయాలని, దహన సంస్కారాలు చేయాలని అనుకున్నారు కానీ, చివరకు ఎమ్మెల్యేల కటౌట్ల ముందు టెంకాయలు, కర్పూరం ఉంచి, వాటిని నదిలో పడేశారు. శవయాత్రలో లాగా డప్పు కొట్టించారు. ఆనం రామనారాయణ రెడ్డితో అదే నియోజకవర్గంలో కలసి కార్యక్రమాల్లో పాల్గొని, జై కొట్టిన నేతలే, ఇప్పుడు ఆయన కటౌట్ ని కైవల్యానదిలో పడేయడం విశేషం. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కటౌట్ ని మహిళలు నదిలో పడేశారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. వైసీపీ నాయకుడు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన జరిగింది. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారాయన.
మేకపాటిపై కూడా వ్యతిరేకత..
అటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో మేకపాటి శవయాత్రలు జరిగాయి, దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. మేకపాటికి వ్యతిరేక వర్గాలన్నీ ఏకమవుతున్నాయి. ఉదయగిరిలో ఆయన్ను అడుగు పెట్టనీయబోమంటూ ఆందోళనలు చేస్తున్నారు. అటు మేకపాటి కూడా ఉదయగిరి వెళ్లి హడావిడి చేసినా, ఆ తర్వాత అనారోగ్యం కారణంతో ఇంటికే పరిమితమయ్యారు.
నెల్లూరు రూరల్ లో ప్రభావం లేదు..
అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం వ్యతిరేక గ్రూపులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరం జరిగిన తర్వాత ఆయన గ్రూపులోని కొంతమంది ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డివైపు వెళ్లారు. కార్పొరేటర్లు కూడా కొంతమంది ఆదాల పక్కన చేరారు. మిగతావారు మాత్రం కోటంరెడ్డి వర్గంలోనే ఉన్నారు. ప్రస్తుతం కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరడంతో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ టికెట్ ఖాయమని తేలిపోయింది. దీంతో కోటంరెడ్డి వర్గమంతా టీడీపీకి అనుబంధంగా ఉన్నారు. ఉదయగిరి, వెంకటగిరిలో మాత్రం వైసీపీ నాయకులు సస్పెండైన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.