Nellore Adala :    టీడీపీకి అభ్యర్థులు దొరకడంలేదని, అందుకే తమ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని మండిపడ్డారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఉన్న ఆయన, 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన వరుస కార్యక్రమాలతో హడావిడి మొదలు పెట్టారు. రూరల్ లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  నెల్లూరు జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మీడియాను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, టీడీపీకి సరైన నేతలు లేకపోవడంతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని మండిపడ్డారు. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం చంద్రబాబు వ్యూహంలో భాగమేనని చెప్పారు. చంద్రబాబు అనుకూల మీడియాతో ఇలాంటి తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, ఎమ్మెల్యేలంతా టీడీపీవైపు ఆకర్షితులవుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పార్టీ మారతారంటూ వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో నియోజకవర్గంలో పర్యటిస్తే తెలుస్తుందన్నారు ఆదాల. నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారన్నారు. 


అదాల - అనిల్ మధ్య వర్గ పోరాటం ! 
 
ఇటీవల నెల్లూరులో జరిగిన ఆక్రమణల విషయంలో అనిల్ వర్గానికి, దళితులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయంలో ఆదాల వర్గం, అనిల్ వర్గం మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల అనిల్ కూడా ఆదాలను కలసిన సందర్భాలు లేవు. గతంలో ఆదాల రూరల్ ఇన్ చార్జ్ గా బాధ్యతలు చేపట్టిన క్రమంలో అనిల్, ఆదాల ఆఫీస్ కి వెళ్లి, ప్రెస్ మీట్లలో కూడా పాల్గొన్నారు. ఇటీవల వీరిద్దరూ కలసి కనిపించిన సందర్భాలు లేవు. అందులోనూ నెల్లూరు సిటీలో ఆదాల, అనిల్ వ్యతిరేక వర్గంతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న పుకార్లకు బలం చేకూరుస్తోంది. 


నెల్లూరు రూరల్‌లో పార్టీపై పట్టు కోసం అదా ప్రయత్నం 


రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఆదాలను నియమించిన తర్వాత బాగా హడావిడి జరిగింది. ఆయనకు ఘన స్వాగతం పలికారు స్థానిక నేతలు, ప్రెస్ మీట్లతో హడావిడి చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలకోసం ఆదాల ఢిల్లీ వెళ్లడంతో ఇక్కడ రూరల్ నాయకులను పట్టించుకునేవారే లేరు. పోనీ ఆదాల పరోక్షంలో ఎవరు పార్టీని నడిపిస్తారా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. దీంతో రూరల్ లో అందరూ సైలెంట్ అయ్యారు. మరోవైపు కోటంరెడ్డి వర్గం స్థానిక టీడీపీ నాయకులతో కలసి రాజకీయాలు మొదలు పెట్టింది. దీన్ని ఆదాల వర్గం ఎలా తట్టుకుంటుందో చూడాలి. 


అదాలకు గడ్డు పరిస్థితేనని విశ్లేషణలు


ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి కచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్నారు. అనుకోకుండా నెల్లూరు రూరల్ స్థానం ఖాళీ కావడంతో ఆయన అక్కడ పోటీకి సిద్ధమయ్యారు. అయితే రూరల్ లో కోటంరెడ్డి టీడీపీనుంచి పోటీ చేస్తే ఆదాలకు టఫ్ ఫైట్ ఎదురవుతుంది. ఆదాల ఖర్చుకు వెనకాడకపోయినా.. అటు రూరల్ లో కోటంరెడ్డికి ఉన్న స్థానిక బలం, దానికి తోడు టీడీపీకి ఉన్న కార్యకర్తల బలం రెండూ కలిస్తే.. వైసీపీకి విజయం అంత ఈజీ కాదని తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం ఆదాలతో ఉన్న కార్పొరేటర్లలో కొంతమంది కోటంరెడ్డి అనుచరులు కూడా ఉన్నారు. వారంతా ఇప్పటికిప్పుడు ఆదాలతో కలసి ఉన్నా కూడా ఎన్నికల టైమ్ కి ప్లేటు ఫిరాయిస్తే వైసీపీకి మరింత కష్టం అనే చెప్పాలి.