సోషల్ మీడియా ఎప్పుడు ఎవర్ని ఎలా టాప్ ప్లేస్ కి తీసుకెళ్తుందో చెప్పలేం. టిక్ టాక్ వచ్చిన తర్వాత అందరి టాలెంట్ బయటపడుతూ ఉంది. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తమ టాలెంట్ ని బయటపెడుతున్నారు, ఫేమస్ అవుతున్నారు. అలా టిక్ టాక్, ఆ తర్వాత ఇన్ స్టా గ్రామ్ తో ఫేమస్ అయిన అమ్మాయే శ్యామల. శ్యామల అంటే ఇప్పుడెవరికీ తెలియదు కానీ, బంగారం అంటే మాత్రం సోషల్ మీడియాలో బాగా ఫేమస్. బంగారం.. నీకు ఒకటి చెప్పనా అంటూ ఆమె చేసిన ఇన్ స్టా వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. 


శ్యామల అలియాస్ బంగారం సొంత ఊరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు. అమ్మ, తమ్ముడు.. ఇదే ఆమె కుటుంబం. పదో తరగతి వరకు చదువుకున్న బంగారం ఆ తర్వాత ఆత్మకూరులోనే ఓ ఫ్యాన్సీ స్టోర్ లో సేల్స్ గర్ల్ గా పనిచేసేది. సేల్స్ గర్ల్ గా పనిచేస్తూనే టిక్ టాక్ వీడియోలు చేసేది.




టిక్ టాక్ లో కూడా బంగారం పేరుతో బాగా ఫేమస్. సంప్రదాయ వస్త్రధారణతో బంగారం చేసే వీడియోలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సడన్ గా టిక్ టాక్ ని ఇండియాలో బ్యాన్ చేసే సరికి బంగారం లాంటి చాలామంది ఔత్సాహికులు షాకయ్యారు. అయితే ఎవరికి వారు ప్రత్యామ్నాయ ప్లాట్ ఫామ్ లు వెదుక్కున్నారు. అలా బంగారం కూడా ఇన్ స్టా లోకి వచ్చేసింది. 


బంగారం.. బంగారం.. అంటూ ఎక్కడో ఉన్న తన ప్రియుడికోసం తపించిపోయినట్టు మాట్లాడటం ఈ అమ్మాయి స్టైల్. ఈ బంగారం పేరు విని నిజంగానే అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. కేవలం ఇన్ స్టా వీడియోలకోసం ఆమె ఆ ఓ క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకుని ఛీ పోరా.. అంటూ అతనితో మాట్లాడినట్టుగా వీడియోలు చేసేది. ఈ వీడియోలే ఆమెను పాపులర్ చేశాయి. 




ఇటీవల సోషల్ మీడియా అప్ కమింగ్ స్టార్ గా హైదరాబాద్ లో ఓ సంస్థ అవార్డు కోసం వెళ్లిన బంగారం.. అక్కడే జబర్దస్త్ షో కి కూడా అటెండ్ అయింది. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని చెబుతోంది. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ జబర్దస్ట్ టీమ్ లో తనకు ఆఫర్ వచ్చిందని అంటోంది బంగారం. హైదరాబాద్ లో అందరూ తనను బాగా గుర్తు పట్టారని, బంగారం బంగారం అంటూ సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారని చెబుతోంది ఈ అమ్మాయి.  సొంత ఊరు ఆత్మకూరు వచ్చినా కూడా ఆమె ఇప్పుడు బిజీగా మారిపోయింది. దసరా సందర్భంగా అమ్మవారి వేష ధారణతో భక్తి పాటల వీడియోల్లో నటిస్తోంది. 




టాలెంట్ అందరిలో ఉంటుందని, అయితే ఆ టాలెంట్ బయటపెట్టుకోవాలని, ఎవరు నిరుత్సాహపరిచినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లాలని చెబుతోంది బంగారం. తమ్ముడు, అమ్మతో కలసి నటనవైపు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తోంది.