Venkatagiri News: ఏపీ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి పోరులో కొన్ని చోట్ల అంతర్గత రాజకీయాలు చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఒక్కోచోట ఒక్కో పార్టీలోనే సమస్యలు ఉంటే.. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాత్రం రెండు పార్టీల్లోనూ సమస్యలున్నాయి. ఇక్కడ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఇక టీడీపీలో ఏకంగా టికెట్ ఆశించి భంగపడిన నాయకుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇంటిపోరుని త్వరగా పరిష్కరించుకోగలిగే పార్టీకే ఇక్కడ విజయం వరించే అవకాశాలున్నాయి.
వైసీపీ పరిస్థితి ఏంటి..?
2019లో ఇక్కడ వైసీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆయన పార్టీకి దూరమయ్యారు. కాలక్రమంలో టీడీపీలో చేరి, ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే ఆయనకు ప్రస్తుతం వెంకటగిరితో పనిలేదు. ఇక వైసీపీ అభ్యర్థిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఇక్కడ ఇంటిపోరు ఎక్కువైంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తండ్రి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి, తల్లి రాజ్యలక్ష్మి.. ఇద్దరూ వెంకటగిరికి ప్రాతినిధ్యం వహించినవారే. ఈ నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబానికి మంచి పట్టు ఉంది. కానీ రామ్ కుమార్ రెడ్డి హయాంలో మాత్రం ఆ ఫ్యామిలీకి ఉన్న ఓట్లు చెల్లాచెదురయ్యాయి. నేదురుమల్లి అనే బ్రాండ్ ఇక్కడ పెద్దగా పనిచేయట్లేదు. కేవలం జగన్ బ్రాండ్ చూసి మాత్రమే ఓటర్లు వైసీపీవైపు రావాల్సి ఉంటుంది. ఇటీవల టికెట్ల ఖరారు సమయంలో కూడా నేదురుమల్లి వ్యతిరేక వర్గం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పంచాయితీ పెట్టింది. ఆ తర్వాత వైరి వర్గం నేతలు ఏకంగా మీటింగ్ పెట్టుకున్నారు. నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా ఉన్న మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాను స్వతంత్రంగా బరిలో ఉంటానన్నారు. ఈ సమస్యను వైసీపీ అధిష్టానం పరిష్కరించాల్సి ఉంది.
టీడీపీ పరిస్థితి ఏంటి..?
టీడీపీలో మొన్నటి వరకు టికెట్ పంచాయితీ ఉండేది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా తనకు వెంకటగిరి కావాలన్నారు. ఆయన ఆత్మకూరుకి వెళ్లిపోవడంతో చివరకు ఇద్దరు ఆశావహులు బరిలో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ప్రధాన పోటీదారుగా డాక్టర్ మస్తాన్ యాదవ్ ఉన్నారు. మస్తాన్ యాదవ్ బీసీ కోటాలో తనకు సీటు కావాలన్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా వారిద్దర్నీ కాదని కురుగొండ్ల కుమార్తె లక్ష్మీ సాయి ప్రియకు టికెట్ ఇచ్చారు. దీంతో మస్తాన్ యాదవ్ హర్ట్ అయ్యారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
మస్తాన్ యాదవ్ చేరికతో వైసీపీ బలం పెరిగిందని అనుకున్నా.. ఇటు ఇంటిపోరుతో ఆ పార్టీ సతమతం అవుతోంది. ప్రస్తుతానికి వెంకటగిరిలో మహిళా అభ్యర్థిగా లక్ష్మీ సాయిప్రియకే మొగ్గు ఎక్కువగా కనపడుతోంది. ఈ దశలో వైసీపీ దిద్దుబాటు చర్యలు చేపడుతుందా..? అసమ్మతి వర్గాన్ని బుజ్జగిస్తుందా..? వేచి చూడాలి. అటు మస్తాన్ యాదవ్ మైనస్ కావడంతో టీడీపీకి కూడా కొన్ని ఓట్లు కోత పడక తప్పదు. ఆ గ్యాప్ ని తెలుగుదేశం ఎలా కవర్ చేస్తుందో చుడాలి.