నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. రాకపోకలు ఆగిపోవడంతో ప్రజలు ప్రయాణాలు ఆపివేసుకున్నారు. ఎక్కడివారక్కడే గ్రామాలకు పరిమితమయ్యారు.
ఉద్యోగుల కష్టాలు..
ఉద్యోగులు మాత్రం ప్రతి నిత్యం విధులకు హాజరవ్వాల్సిన పరిస్థితి. విధులకు హాజరయ్యేందుకు పొదలకూరు మండలం నావూరు హైస్కూల్ హెడ్మాస్టర్ మురళి.. ఆల్తుర్తి వాగు దాటేందుకు సిద్ధమయ్యారు. ఆయనతోపాటు, మరొక స్నేహితుడితో కలసి కారులో బయలుదేరారు. కారు వాగుదాటే క్రమంలో ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో హెడ్మాస్టర్, అతని స్నేహితుడు భయపడి ఎలాగోలా డోర్ తీసుకుని బయటకు వచ్చేశారు. వాగు ప్రవాహం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత గ్రామంలోకి వెళ్లి పరిస్థితి వివరించారు. గ్రామస్తులను తీసుకుని వాగు వద్దకు వచ్చారు.
కారుని ఇలా బయటకు తీశారు.
గ్రామస్తులు ట్రాక్టర్ సహాయంతో కారుని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కారుకి వైరు కట్టి బయటకు లాగారు. అయితే కారు మధ్యలో ఇరుక్కుపోవడంతో ఓ దశలో ట్రాక్టర్ తో బయటకు లాగడం కూడా సాధ్యం కాలేదు. దీంతో మరోసారి కారులో ఎక్కి దాన్ని రివర్స్ గేర్ వేసేందుకు ప్రయత్నించారు. కారు స్టీరింగ్ కదిలించడంతో ట్రాక్టర్ తోపాటు బయటకు తీసుకు రాగలిగారు.
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలో కూడా వర్షాలకు డ్రైనేజీలు పొంగి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు..
అటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సముద్రం కల్లోలంగా ఉంటుందని వారిని హెచ్చరించారు. అల్ప పీడన ప్రభావం తగ్గే వరకు వేటకు వెళ్లొద్దని సూచించారు.
పెన్నాకు పెరిగిన ప్రవాహం..
జిల్లాలోని సోమశిల ప్రాజెక్ట్ కి కూడా ఇటీవల వరద ప్రవాహం పెరిగింది. పెరిగిన ప్రవాహాన్ని నేరుగా నదిలోకి వదిలేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు మరోసారి సోమశిల నిండు కుండలా మారింది. దిగువన కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పెన్నాలో కలుస్తున్నాయి. నెల్లూరు సమీపంలో పెన్నాకు జలకళ వచ్చింది. నగర పరిధిలో పెన్నా తీరంలో నివశించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోకి పెన్నా నీరు చేరుకునే అవకాశం ఉండటంతో వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు నగరంలో పారిశుధ్యంపై కూడా దృష్టి పెట్టారు అధికారులు. వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా కలెక్టర్ సమీక్ష..
వర్షాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఎప్పటికప్పుడు అధికారుల దగ్గర సమాచారం తెప్పించుకుని సమీక్ష నిర్వహిస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షపాతం మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశముందని, ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.