కందుకూరు తొక్కిసలాట ఘటనలో 8మంది మృతి చెందిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీడీపీ లీడర్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కందుకూరు టీడీపీ ఇన్ చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైడ్రామా కొనసాగింది. అరెస్ట్ తర్వాత వారిద్దరినీ పోలీసులు రహస్యంగా విచారించారనే వాదనలు వినపడ్డాయి. అసలు వారిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటూ టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. దీంతో ఎట్టకేలకు హైడ్రామా నడుమ ఇంటూరి సోదరులకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు కందుకూరు పోలీసులు.
కందుకూరులో న్యాయమూర్తి పూర్ణిమాదేవి తెల్లవారుజామున 5.20 గంటలకు వారిద్దరికీ బెయిల్ మంజూరు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అయితే అరెస్ట్, బెయిల్ మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వారిద్దర్నీ హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు, కందకూరుకి తీసుకొచ్చారు. పోలీసులు మఫ్టీలో వెళ్లి, రెండు వాహనాల్లో వారిద్దర్నీ కందుకూరుకి తీసుకొచ్చారన తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు జిల్లాలో తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఎట్టకేలకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.
అరెస్ట్, బెయిల్.. మధ్యలో ఏం జరిగింది..?
కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ ను.. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.45గంటలకు కందుకూరుకి తీసుకొచ్చారు పోలీసులు. అయితే అప్పటికే టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి నాయకులను స్టేషన్ కి తరలించారు.
ఇంటూరి నాగేశ్వరరావు, రాజేష్ ను పోలీసులు స్టేషన్ లోకి తరలించే క్రమంలో స్థానిక బార్ అసోసియేషన్ నాయకులు, టీడీపీకి చెందిన కొంతమంది న్యాయవాదులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్టేషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. న్యాయవాదులు, దామచర్లతోపాటు ఇతర టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ దశలో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాజరికంలో ఉన్నామా అంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
టీడీపీ నాయకులు రాత్రి రెండున్నర గంటల సమయంలో హైకోర్టు న్యాయవాదులను బెయిల్ కోసం కందుకూరుకి పంపించింది. వారు పోలీసులతో చర్చించిన తర్వాత లోపలికి వెళ్లారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత 2.55 గంటలకు వైద్య పరీక్షల కోసం నాగేశ్వరరావు, రాజేష్ ను పోలీసులు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. 3.25 గంటల తర్వాత స్థానిక న్యాయమూర్తి పూర్ణిమా దేవి వద్దకు తీసుకువెళ్లారు. 5 గంటల వరకు వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి నివాసం బయట ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఆమె బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ అక్కడినుంచి ఇంటూరి సోదరులతో కలసి వారి నివాసానికి బయలుదేరాయి.