ఆమధ్య కోటంరెడ్డ శ్రీధర్ రెడ్డిలాంటి కలుపు మొక్కలు తమ పార్టీకి అవసరం లేదంటూ నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ చార్జ్ అబ్దుల్ అజీజ్ తేల్చి చెప్పారు. తమ అధినాయకత్వం ప్రస్తుతానికి ఎలాంటి హింట్ ఇవ్వలేదన్నారాయన. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా టీడీపీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి కోటంరెడ్డిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కోటంరెడ్డిని టీడీపీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.


తాజాగా కోటంరెడ్డి అనుచరుడు అరెస్ట్ అయిన కేసులో బాధితుడు మాతంగి కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మల్యే కోటంరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వైసీపీలో ఉండగా టీడీపీ నేతల్ని కావాలనే టార్గెట్ చేసుకుని వేధించేవారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన అనుచరుడిని అరెస్ట్ చేసే సరికి పోలీస్ స్టేషన్లకు తిరుగుతూ డ్రామాలాడుతున్నారని చెప్పారు. సజ్జలపై ఆరోపణలు చేయడం కాదని, ఆయన చేసిన తప్పులకే ఆయన అనుచరుల్న అరెస్ట్ చేస్తున్నారని అన్నారు మాతంగి కృష్ణ.


టీడీపీ నాయకుల పై దాడి చేసిన కేసులో మొదటి ముద్దాయిలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి అని ఆరోపిస్తున్నారు. దాడులు చేయించిన కోటంరెడ్డి సోదరులను ఎందుకు అరెస్ట్ చేయలేదని టీడీపీ నేతలు పోలుసుల్ని నిలదీస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీ లోకి వస్తే తమ భార్య బిడ్డలు రోడ్డున పడే పరిస్థితులు వస్తాయన్నారు. అలాంటి వారిని టిడిపిలోకి తీసుకునేది లేదని లోకేష్, చంద్రబాబు స్పష్టం చేశారని చెప్పారు. టీడీపీ నాయకులు పై దాడులు చేసినప్పుడు శ్రీధర్ రెడ్డికి దళితులు ముస్లింలు గుర్తు రాలేదా..? అని ప్రశ్నించారు. తన మెడ పై కత్తి పెట్టి బెదిరించినప్పుడు శ్రీధర్ రెడ్డికి మా భార్య బిడ్డలు గుర్తు రాలేదా...? అన్నారు మాతంగి కృష్ణ.


కోటంరెడ్డిని ప్రజలు నమ్మరు..


కోటంరెడ్డి ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మూడున్నరేళ్ల కాలంలో కేవలం టీడీపీ నాయకులనే టార్గెట్  చేసుకుని ఎన్నో దౌర్జన్యాలు దాడులు చేశారంటున్నారు ఆ పార్టీ నేతలు. తాను ఆ సమయంలో దొరకలేదు కాబట్టి, తన బండిని తగలపెట్టారని మాతంగి కృష్ణ వాపోయారు. తాను దొరికి ఉంటే సజీవ దహనం చేసి ఉండేవారన్నారు.


అసలేం జరిగిందంటే..?


గత అక్టోబర్ 17న టీడీపీ నాయకుడు అల్లాబక్షుపై రూరల్ ఎమ్మెల్యే అనుచరులు దాడికి యత్నించారని, ఆ సమయంలో అల్లాబక్షుకు అండగా తాను ఉన్నానని, అది మనసులో పెట్టుకుని అక్టోబర్ 18 ఉదయం తొమ్మిది గంటల సమయంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు తనపై దాడి చేసి చంపబోయారని తెలిపారు మాతంగి కృష్ణ. 25మంది దాడిలో పాల్గొన్నారని, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆ సమయంలో చర్యలు తీసుకోకపోవడంతో తాను నేషనల్ ఎస్సీ కమిషన్ ను సంప్రదించానని చెప్పారు మాతంగి కృష్ణ.  నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి నోటీసులు వచ్చాకే పోలీసులు స్పందించారని తెలిపారు. ఇప్పటికి చేసిన అరెస్ట్ లు సరిపోవని, తనపై దాడి చేయించింది రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అని దాడి కేసులో మొదటి ముద్దాయి శ్రీధర్ రెడ్డి అని ఆయన్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.


మొత్తమ్మీద కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసుకుంటున్న తరుణంలో ఈ కేసులు, కేసుల విషయంలో టీడీపీ నాయకుల విమర్శలు కాస్త గందరగోళానికి దారి తీస్తున్నాయి.