ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంతో దేశవ్యాప్తంగా పార్టీ మంచి ఆనందంతో ఉంది. అధికారం లేని రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బలపడే దిశగా వేగంగా అడుగు వేస్తోంది. దీని కోసం స్పెషల్ ప్లాన్‌తో ఉన్నట్టు స్థానిక నాయకత్వం చెబుతోంది. 


దీటుగా సమాధానం


ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం కైవసం చేసుకుంటామని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతోంది ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ. 


మారిన వ్యూహం


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వా మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... వైసీపీ ప్రభుత్వంపై విమర్శల డోసు పెంచారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలనే అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తామన్నారు. కేంద్రం పథకాలను వైసీపీ తమ విజయంగా చెప్పుకుంటోందనేది ఆయన ప్రధాన ఆరోపణ. అదే సమయంలో కేంద్రంపై మాత్రం రాష్ట్రం నిందలు వేస్తోందని అన్నారు. రోడ్లు కేంద్ర ప్రభుత్వం వేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకుంటోందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వలసలు పెరిగి పోతున్నాయని విమర్శించారు.


రైతులపై ఫోకస్


రైతాంగ సమస్యలపై కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించబోతున్నట్టు తెలిపారు సోము వీర్రాజు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వచ్చి సమయంలో కేంద్రం వేసే రోడ్లను తామే వేస్తున్నట్లు వైసీపీ తమ సొంత పత్రికలో రాసుకుందని వీర్రాజు ఆరోపించారు. అబద్ధాలతో ఆంధ్ర రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తులు, కుటుంబాలకు బీజేపీ ప్రత్యామ్నాయమని పేర్కొన్నారాయన. 


అవినాష్ అక్కర్లేదు


ఏపీలోని రాజకీయ పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు జోటు చేసుకున్నాయి. వివేకా కుమార్తె సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అంటూ ప్రముఖంగా కథనాలు వచ్చాయి. వివేకా హత్య కేసుని సీబీఐకి అప్పగిస్తే.. అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ వైఎస్ జగన్ సునీతకు చెప్పినట్టు ఆ కథనాల సారాంశం. దీనిపై సోమువీర్రాజు ఘాటుగా స్పందించారు. అసలు అవినాష్ రెడ్డి లాంటి వారు బీజేపీకి అవసరం లేదని అన్నారు సోము వీర్రాజు. అసలాయన బీజేపీలో చేరతారని ఎవరితో అన్నారు, ఎందుకన్నారు, విన్నవారు దాన్ని ఎవరితో చెప్పారంటూ నిలదీశారు. 


మరక చెరిపేందుకు యత్నం


ఇటీవల వైఎస్ వివేకా హత్యకేసుకి సంబంధించి వైఎస్ఆర్ కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినమాట తెలిసిందే. ఈ కేసులో సీఎం జగన్ ని, ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయాలని చూస్తోంది టీడీపీ. అదే సమయంలో అవినాష్ రెడ్డిపై కేసు పెడితే ఆయన బీజేపీలోకి వెళ్తారని గతంలో జగన్ వివేకా కుమార్తె సునీతతో చెప్పినట్టు కూడా కథనాలొచ్చాయి. అంటే.. కేసులున్నవారంతా బీజేపీ శరణు కోరతారనే అర్థం వచ్చేలా కమలం పార్టీపై మరకపడింది. గతంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన రాజ్యసభ సభ్యులు కూడా అదే తరహాలో బీజేపీలో చేరారనే అపవాదు కూడా ఆ పార్టీపై ఉంది. దీంతో.. అవినాష్ రెడ్డి విషయంలో రాష్ట్ర  బీజేపీ ఎదురుదాడికి దిగింది. అవినాష్ రెడ్డి తమకు అక్కర్లేదని అంటూనే.. వైసీపీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు చేసుకుంటూంటే అంతిమ ఫలితం ఎలా ఉన్నా.. అది తమకు లాభిస్తుందనది ఆశపడుతోంది బీజేపీ.