Ali Comments On Nallapureddy Prasanna Kumar Reddy:  సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ(Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(Nallapureddy Prasanna Kumar Reddy) మంత్రి అయితే చూడాలని ఉందన్నారు. ఆయన మంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆయన్ను మంత్రి చేసుకునే అవకాశం నియోజకవర్గ ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పారు అలీ. ప్రసన్న కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈసారి ఆయనకు 90వేల మెజార్టీ రావాలని చెప్పారు. ఆ స్థాయి మెజార్టీ వస్తే కచ్చితంగా ఆయన మంత్రి అవుతారని అన్నారు అలీ. 


వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రల్లో అలీ చురుగ్గా పాల్గొంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు ఈ బస్సు యాత్రలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బస్సు యాత్రలో పాల్గొన్నారు సినీ నటుడు అలీ. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ హయాంలో ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. వైసీపీలో చేరిన తర్వాత మాత్రం ఆయన సీనియార్టీకి తగ్గ ప్రతిఫలం దక్కలేదనే ప్రచారం ఉంది. ఓ దశలో ప్రసన్న కుమార్ రెడ్డి అలిగారని, మంత్రి పదవి రాలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారని కూడా అన్నారు. అయితే ఆ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. మంత్రి పదవి రాలేదని తాను అలిగినట్లు అసత్య కథనాలు రాయిస్తున్నారని, రాసి పెట్టి ఉంటే పదవులు ఎక్కడికీ పోవని పేర్కొన్నారు ప్రసన్న. ఇప్పుడు అలీ కూడా ఆయన మంత్రి పదవిపై కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. 


నెల్లూరుతో నా అనుబంధం..
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అని అన్నారు అలీ. నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్సో.. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ అన్న అంత ఫేమస్ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ కోసం సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని చెప్పారు అలీ. నెల్లూరులో ఒక సినిమా హిట్ అయితే దేశం మొత్తం అది హిట్ అయినట్టే లెక్క అన్నారు అలీ. నెల్లూరు సినిమా టాక్ కి అంత పవర్ ఉందని చెప్పారు. 


వైఎస్ తో అనుబంధం.. 
వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు అలీ. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి బ్రహ్మానందంతో కలసి తాను ఆయన దగ్గరకు వెళ్లానని తమ కష్టాలు చెప్పుకున్నామని అన్నారు అలీ. హైదరాబాద్‌ లో తమకున్న భూమిలో లారీలు, బస్సులు వెళుతున్నాయని ఆయనకు చెప్పామని.. వెంటనే ఆ సమస్యను ఆయన పరిష్కరించారని అన్నారు. వాళ్లు కళాకారులు వారిని బాధ పెట్టొద్దు అని ఒక అధికారికి చెప్పి వైఎస్ఆర్ తమకు న్యాయం చేశారని గుర్తు చేసుకున్నారు. పేదల ఆరోగ్యం కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువస్తే, దాని పరిమితిని రూ.25 లక్షలకు పెంచి పేదలకు సీఎం జగన్ మరింత మేలు చేశారన్నారు. జగనన్న ఇళ్లను చూస్తే తనకు ఎంతో సంతోషం కలుగుతుందన్నారు అలీ. తాను కూడా పేదరికం అనుభవించానని, ఎన్నో బాధలు చూశానని, పేదలందరికీ ఇల్లు కట్టించడం ఎంతో ఆనందం అని అన్నారు.