తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి గురుకులాల్లో చదువుకోడానికి వచ్చే విద్యార్థినీ విద్యార్థులు నిత్యం సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఊరికి చివరగా చెట్టు, పుట్టల మధ్య ఉండే గురుకులాల్లో ఎప్పుడు ఏ విష కీటకం ఏవైపు నుంచి వస్తుందో అని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి. తాజాగా నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు  విద్యార్థినులకు తేలు కాటు వేసింది. రాత్రి హాస్టల్ లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థినులు శాంతి ప్రియ, వైష్ణవి లను తేలు కాటు వేసింది. దీంతో వారిద్దరూ భయాందోళనలకు గురయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బంది  హుటాహుటిన ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. 


సంగం మండల కేంద్రంలోని గురుకులంలో పిల్లలు కింద పడుకోవడం వల్లే వారిని తేలు కాటు వేసిందని తెలుస్తోంది. విద్యార్థులకు ఇక్కడ సరైన వసతి సౌకర్యం లేదని, గురుకులంలో నేలపైనే పడుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. గతంలో కూడా విషకీటకాలు ఇక్కడికి వచ్చిన ఉదాహరణలున్నాయని, తెల్లవారు ఝామున కావడంతో వెంటనే తేరుకుని సిబ్బంది సాయంతో విద్యార్థినులను ఆత్మకూరు తరలించారు. అర్థరాత్రి కాటు వేస్తే, పురుగు అని వదిలేస్తే.. పరిస్థితి మరింత ప్రమాదానికి దారి తీసేగి. 


గురుకులాలు.. ఎంతవరకు క్షేమం..? 
ఇదే నెలలో విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. ముగ్గురు విద్యార్థులను పాము కాటేయగా.. వారిలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు కోలుకున్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. 


రెండ్రోజుల క్రితం తెలంగాణలోనూ ఘటన.. 
పాముకాటుతో విద్యార్థి మృతిచెందిన సంఘటన మేడ్చల్‌ జిల్లా కీసర మండలం భోగారంలోని జ్యోతిబా పూలే గురుకులంలో జరిగింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం కొమిశెట్టిపల్లికి చెందిన గొల్ల రమేశ్‌, అమృతమ్మ దంపతుల కుమారుడు శివశంకర్‌ (13) ఈ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం బాలుడు శివశంకర్‌ తన మిత్రులతో ఆడుకుంటూ  రాళ్లకుప్పలో పడిన బంతిని తీస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. ఈవిషయా న్ని తన మిత్రులకు, గురుకుల సిబ్బందికి చెప్పాడు. సిబ్బంది శివశంకర్‌ ను ఘట్ కేసర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శరీరంలో విషం పాకి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించాలని వైద్యు లు సూచించారు. వెంటనే సమీపంలోని కాకతి అనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే శివశంకర్‌ మృతిచెందాడు. గురుకులం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని, కారకులపై చర్యలు తీసుకోవాలని శివశంకర్‌ తల్లిదండ్రులు కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.