Penna River in Nellore Sangam Barrage: కృష్ణానదికి భారీగా వరదలు వచ్చినప్పుడు కొన్ని బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లకు అడ్డం పడటం చాలా సార్లు జరిగాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెల్లూరు లోని పెన్నా సంగం బ్యారేజీకి వచ్చింది. ఓ భారీ ఇసుక బోటు లంగర్ తెగిపోయి డ్యాం వైపు దూసుకు వచ్చింది. ఆ బోటు డ్యాం గేట్లకు తాకి ఉన్నట్లయితే పెను ప్రమాదం జరిగి ఉండేది. కానీ అధికారులు ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటే..బోటును ఒడ్డుకు చేర్చారు. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద బోటు ప్రజల్ని, రైతుల్ని టెన్షన్ పెట్టింది. మోంథా తుపాను వల్ల అత్యధిక వర్షం పడిన ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. ఈ కారణంగా పెన్నా నదిలో లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో, 30 టన్నుల బరువున్న ఇసుక బోటు, లంగరు తెగిపోయి, నేరుగా బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది.
పోటెత్తే వరద ఉద్ధృతికి, ఒకవేళ ఆ భారీ బోటు బ్యారేజీకి తగిలి ఉంటే 85 గేట్లతో నిర్మితమైన సంగం బ్యారేజీ భారీగా దెబ్బతినేది. దాదాపుగా నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు దెబ్బతింటే ఎంత నష్టం జరిగేదో అంచనా వేయాల్సిన పని లేదు. రాబోయే సీజన్‌లో రైతులు కన్నీరు కార్చేవారు. పొదలకూరు, సంగం వంటి కీలక గ్రామాల మధ్య రాకపోకలకు వారధిగా నిలిచే ఈ బ్యారేజీ దెబ్బతింటే పునరుద్ధరణ కూడా చాలా సమస్య అయ్యేది.
బోటు గురించి తెలియగానే, జిల్లా యంత్రాంగం క్షణం కూడా ఆలస్యం చేయలేదు. కలెక్టర్ హిమాన్షు శుక్లా , ఎస్పీ అజిత వజ్రేంద్ర ఆఘమేఘాలపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి 30 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని.. 30 మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రప్పించారు. పెన్నా నది ప్రవాహానికి ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఆ బోటు బ్యారేజీ వైపుకు దూసుకెళ్లే సమయంలోనే అడ్డుకుని చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు!
అధికారుల సమయస్ఫూర్తిని నారా లోకేష్ కూడా అభినందించారు.