తెల్లవారు ఝామున ఓ కారులో ఎర్రచందనం దుంగలు వస్తున్నట్టు నెల్లూరు జిల్లా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. హైవేపై పెట్రోలింగ్ మొదలు పెట్టారు. నెల్లూరు వైపు వచ్చే వాహనాలను సంగం వద్ద ఆపి చెక్ చేసి పంపిస్తున్నారు. ఎర్రచందనం దొంగల వ్యవహారం తెలుసు కాబట్టి.. ముందుగా ఓ లారీని రోడ్డుకి అడ్డుగా పెట్టి పని మొదలు పెట్టారు. ఈలోగా సంగం కొండపైనుంచి నెల్లూరు వైపుకి కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న కారు దూసుకొచ్చింది. పోలీసుల్ని చూడగానే ముందుగా అలర్ట్ అయ్యారు. దొంగలు. కారు రన్నింగ్ లో ఉండగానే వెంటనే డోర్లు తీసుకుని రోడ్డుపైకి దిగిపోయారు. అంతే ఒక్క ఉదుటున కొండపైకి పారిపోయారు. చీకట్లో వారిని గుర్తించడం పోలీసులకు సాధ్యం కాలేదు. కొండపైకి వెళ్లినవారి గురించి వెదికినా ఫలితం లేకపోయింది. స్పీడ్ బ్రేకర్ల వద్ద ఆగిపోయిన కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 




ఆ కారులో అదిరిపోయే సెటప్.. 
కారుని ఎర్రచందనం దుంగల రవాణాకోసం స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారు దొంగలు. వెనక డిక్కీలో దుంగలు పెడితే.. ముందు డ్రైవర్ సీటు వరకు వస్తాయి. దీనికోసం కారులో వెనక సీట్లు తీసేసి వాటిని తాత్కాలికంగా దుంగలపై అమర్చారు. కారు సెటప్ మాత్రం అదిరిపోయింది. దీన్ని చూసి పోలీసులే షాకయ్యారు. మొత్తం 10 దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. సంగం కొండపైకి పారిపోయిన దొంగల గురించి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. 




నెల్లూరు జిల్లాలో ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంపై పెద్దగా అలికిడి లేదు. పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చే అక్రమ మద్యం రవాణా చేస్తూ కొంతమంది పోలీసులకు చిక్కిపోతున్నారు. ఉదయగిరి ప్రాంతంలో కొండకింద పల్లెల్లో ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా నిల్వచేస్తారనే సమాచారం ఉన్నా కూడా అక్కడ కూడా ఇప్పుడు ఆ జాడ లేదు. తాజాగా సంగం వద్ద చేపట్టిన పోలీస్ ఆపరేషన్లో కారు వదిలిపెట్టి దొంగలు పారిపోయారు. 


ఎర్ర చందనం స్మగ్లర్లు సమీప ప్రాంతంలోకే పారిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు పోలీసులు. సంగం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. నెల్లూరు-ముంబై హైవేపై గతంలో కూడా ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్న ఉదాహరణలున్నాయి. గతంలో కూడా కొన్ని వాహనాల్లో దుంగల్ని ఇలాగే రవాణా చేసేవారు. అయితే ఇప్పుడు కారులో ఏకంగా ఓ సెటప్ క్రియేట్ చేసి మరీ దుంగల్ని తరలించడం చూస్తుందే దొంగలు ఎంతగా తెలివిమీరిపోయారో అర్థమవుతుంది.  జిల్లా పోలీసులు కూడా ఇటీవల ఎర్రచందనం దుంగలు, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడంపై సీరియస్ గా దృష్టిపెట్టారు.