ప్రకాశం జిల్లాకు చెందిన ఘరానా మోసగాడు రావులకొల్లు రమేష్ హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యాడు. దీపం ఒత్తులు, బొట్టుబిళ్లల తయారీ యంత్రాల అమ్మకం పేరుతో చాలామందిని ఈ ఘరానా మోసగాడు బుట్టలో వేసుకున్నాడు. ఆ యంత్రాలపై తయారైన వస్తువులు తిరిగి తానే కొంటానంటూ అందర్నీ నమ్మించాడు. ఆ తర్వాత బోర్డ్ తిప్పేశాడు. ఈ ఘరానా మోసగాడి చేతిలో బలైపోయిన బాధితులంతా పోలీస్ కేసు పెట్టడంతో వ్యవహారం బయటపడింది. ఇతని కోసం గాలిస్తున్న పోలీసులు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర 14 ఒత్తులు, బొట్టుబిళ్లల తయారీ యంత్రాలు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ముడి సరుకుతోపాటు అతని ఆఫీస్ లో ఉన్న రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు.


ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గంగంపల్లికి చెందిన రావులకొల్లు రమేష్‌(40) ఏడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఏఎస్ రావు నగర్ పరిధిలోని జమ్మిగడ్డలో నివాసం ఉండేవాడు. 2021లో ఏఎస్‌ రావు నగర్‌ లో ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ద్వారా దీపపు ఒత్తులు, బొట్టుబిళ్లల తయారీ యంత్రాల వ్యాపారం ప్రారంభించాడు. యంత్రాలు కొన్న వారికి ముడి సరుకు తానే ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత ఉత్పత్తులను కూడా తానే కొనుగోలు చేస్తానంటూ హామీ ఇచ్చాడు.


నిరుద్యోగ యువత, మహిళలు ఇంటి వద్దే ఉండి పని చేసుకోవచ్చంటూ యూట్యూబ్‌ లో ప్రచారం చేసేవాడు రమేష్. ఈ ప్రకటనలు చూసి చాలామంది ఆకర్షితులై అతని బుట్టలో పడ్డారు. వారందరికీ రెండు రకాల ఒత్తుల తయారీ యంత్రాలను విక్రయించాడు రమేష్. ఒక్కో మిషన్ కు 1.20 లక్షల రూపాయలనుంచి నుంచి 2.60 లక్షల వరకు వసూలు చేశాడు. ఒత్తుల తయారీకి వాడే కాటన్‌ను కూడా అతనే సరఫరా చేశాడు. ఒత్తులు చేసి ఇస్తే కిలోకు రూ.300 చొప్పున చెల్లించేలా ఒప్పందం కదుర్చుకున్నాడు. ఇలా కొన్ని నెలల పాటు వ్యాపారం నడిచిన తర్వాత అతను బోర్డ్ తిప్పేశాడు.




కంపెనీ పెట్టిన ఏడాదిలోగా వందలాది మందికి ఇలా బొట్టుబిలు, ఒత్తుల తయారీ యంత్రాలు విక్రయించాడు రమేష్. ఆ తర్వాత వారి దగ్గర ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా మొహం చాటేశాడు. బొట్టుబిల్లలు, ఒత్తులు తయారు చేసినవారు వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలన్నా ఇబ్బంది ఎదురయ్యేది. పెట్టుబడి తిరిగి రాకపోవడంతోపాటు, అసలుకే మోసం వచ్చే పరిస్థితి. అప్పులు తెచ్చి యంత్రాలు కొనుక్కున్నవారు చాలామంది మోసపోయారు. వారికి కుటుంబాల్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అన్ని జిల్లాలనుంచి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


200కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు..


బొట్టు బిళ్లలు, దీపపు ఒత్తుల పేరుతో రమేష్ దాదాపు 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడని తెలుస్తోంది. కొన్నాళ్లుగా సొమ్ము కరెక్ట్ గానే చెల్లించాడు రమేష్. ఆ తర్వాత చెల్లింపులు ఆగిపోవడంతో బాధితులు ఆఫీస్ కి వెళ్లి నిలదీయాలనుకున్నారు. అప్పటికే ఆఫీస్ మూసేసి ఉంది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.