చుట్టూ నిర్మానుష్య ప్రాంతం. ఓ మహిళ ఒంటరిగా స్కూటీపై వెళ్తోంది. ఆమెను ఇద్దరు యువకులు గమనించారు. బైక్ పై వెంబడించారు. చెట్లతో దట్టంగా ఉన్న ప్రాంతం వద్దకు వచ్చేసరికి ఆమె స్కూటీని ఢీకొట్టారు. కిందపడిపోయిన ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఒంగోలు మండలం గుత్తికొండవారి పాలెం వద్ద బాధిత మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.


మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుత్తికొండవారి పాలెంకు చెందిన మహిళ ప్రతి రోజూ ఒంగోలుకి స్కూటీపై వస్తుంది. ఇక్కడ కూరగాయలు అమ్మి తిరిగి స్కూటీపై స్వగ్రామానికి వెళ్తుంది. అయితే ఒంగోలు నుంచి గుత్తికొండవారి పాలెంకు వెళ్లే దారిలో కొంతమేర నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ ప్రాంతంలోనే దుర్మార్గులు ఆమెపై దారుణానికి తెగబడ్డారు.


రక్షించేవారు లేరు..


మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం జరిగినా ఆమె ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. దిశ యాప్ లాంటివి అందుబాటులో ఉన్నా.. అవసరానికి అవి ఉపయోగపడతాయా లేదా అని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఆ మహిళ ఒంగోలు నుంచి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు రాత్రి 10.30కు ఆమెను వెంబడించారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మానుష్య ప్రాంతంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టారు. మహిళ కిందపడిపోగా.. దగ్గర్లోని పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె కేకలు వేస్తూ ప్రతిఘటించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆమెపై ఇద్దరూ సామూహిక అత్యాచారాని పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడే వదిలేసి పరారయ్యారు.


ఆలస్యమవుతున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆమెకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆమెను వెదుక్కుంటూ వారు అదే దారిన వెనక్కు వచ్చారు. చివరకు ఆమె స్కూటీని, ఆమెను గుర్తించారు. తనపై ఇద్దరు యువకులు దాడిచేసి అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె చెప్పడంతో, వారిని వెదికేందుకు కుటుంబ సభ్యులు ఒంగోలు వైపు వచ్చారు. కొత్తపట్నం రోడ్డులోని ఒక పెట్రోల్‌ బంకు సమీపంలో వారిద్దరూ కుటుంబ సభ్యులకు కనిపించారు. మద్యం మత్తులో ఉన్న వారిని ప్రశ్నించబోతే వెంటనే పరారయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా వారే నిందితులుగా గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.


బాధిత మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒంగోలు డీఎస్పీ నాగరాజు, సీఐ వి.శ్రీనివాసరెడ్డి బాధితురాలినుంచి వివరాలు సేకరించారు. మరుసటి రోజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలిని వైద్యపరీక్షలకోసం ఒంగోలు  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఇద్దరు యువకులకోసం గాలింపు..


అత్యాచారం చేసి పారిపోయిన ఆ ఇద్దరు యువకులు స్థానికంగా చేపల చెరువుల వద్ద కాపలాదారులుగా ఉంటున్నట్టు నిర్థారించారు పోలీసులు. వారిని వెదికే ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్మానుష్య ప్రాంతాలనుంచి రాత్రి పూట ఒంటరిగా వాహనాల్లో వెళ్లే మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా, అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా వెంటనే దిశ యాప్ ని ఉపయోగించాలని ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.