Andhra Pradesh High School Timing has been changed: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైస్కూల్ టైమింగ్స్ మార్చాలని చూస్తోంది. సిలబస్ పూర్తికాకపోవడంతోపాటు పరీక్షల టైంలో విద్యార్థులతో టీచర్స్ ఎక్కువ సమయం గడిపేలా సమయాన్ని మారుస్తున్నారు. ముందుగా దీన్ని నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. అక్కడ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు.
9 నుంచి 5 గంటల వరకు స్కూల్
పైలట్ ప్రాజెక్టు కింద నెలకు రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో కొత్త టైమింగ్స్‌ను అమలు చేస్తారు. హైస్కూల్ లేదా హైస్కూల్ ప్లస్‌లో ఈ టైమింగ్స్ అమలులోకి రానున్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్కూల్ పని చేయనుంది. ఈ కొత్త టైమింగ్స్ ప్రకారం సిలబస్ పూర్తి కావడమే కాకుండా ఉపాధ్యాయ ప్రమాణాలు పెరుగుతాయని, విద్యార్థులతో టీచర్లు విలువైన సమయాన్ని గడుపుతారని చెబుతున్నారు.
Also Read: అమరావతికి ఆర్థిక సాయం చేస్తున్న ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
నెల్లూరు నుంచే ప్రారంభం
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకట్రెండు స్కూల్స్‌లో ఈ కొత్త టైమ్‌టేబుల్ అమలు చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఉపాధ్యాయులకు చేరాయి. ఎంపిక చేసిన స్కూల్స్ ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైమింగ్స్ ప్రకారం స్కూల్స్ నడపాలి. స్కూల్స్ ఎంపిక చేసిన రెండు రోజుల్లో విద్యాశాఖాధికారులకు పంపించనున్నారు
మొదటి పిరియడ్ 50 నిమిషాలు
కొత్త టైం టేబుల్‌లో పిరియడ్స్ టైమింగ్స్ కూడా మారనున్నాయి. ఇప్పటి వరకు హైస్కూల్, హైస్కూల్ ప్లస్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు మాత్రమే పని చేశాయి. ఇకపై ఐదు గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. పిరియడ్ టైమింగ్ కూడా 50 నిమిషాలకు పెంచారు. కొత్త టైమ్‌టైబుల్‌పై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిప్రాయలను 30వ తేదీ లోపు విద్యాశాఖాధికారులకు పంపించాలి. దీన్ని బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకుంటారు.
మారిన సమయం ఇదే
హైస్కూల్ ఎప్పటి మాదిరిగానే ఉదయం 9 గంటలకు మొదలవుతుంది.
9:00 గంటలు- ఫస్ట్ బెల్
9:05 గంటలు- సెకండ్ బెల్
9:25 గంటలు- అసెంబ్లీ
9:25-10:15 గంటలు - మొదటి పిరియడ్
10:15-11:00గంటలు- రెండో పిరియడ్
11:00-11:15గంటలు- స్నాక్స్ బ్రేక్
11:15-12:00గంటలు- మూడో పిరియడ్
12:00-12:45గంటలు- నాల్గో పిరియడ్
12:45- 1:45గంటలు- లంచ్ బ్రేక్ (ఇది ఇప్పటి వరకు 45 నిమిషాలు మాత్రమే ఉండేది దీన్ని గంటకు పెంచారు.)
1:45- 2:30గంటలు- ఐదో పిరియడ్
2:30-3:15గంటలు- ఆరో పిరియడ్
3:15-3:30గంటలు- స్నాక్స్ బ్రేక్
3:30-4:15గంటలు- ఏడో పిరియడ్
4:15-5:00గంటలు- ఎనిమిదో పిరియడ్ (ఇదే అదనంగా పెట్టిన పిరియడ్, ఇప్పటి వరకు ఈ పిరియడ్‌కు ముందే స్కూల్‌ను విడిచిపెట్టేసేవాళ్లు)
ఉపాధ్యాయుల అసంతృప్తి
కొత్త టైమింగ్స్‌పై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బోధనేతర పనుల వల్ల ఉపాధ్యాయులపై భారం ఎక్కువగా ఉంటోందని ఇప్పుడు కొత్త టైమింగ్స్ ప్రకారం మరింత భారం పడుతుందని అంటున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించొద్దని విద్యా శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. అయినా ఇంకా కొన్ని యాప్స్ భారం ఉండనే ఉందని చెబుతున్నారు.