Nellore Politics: టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబం టీడీపీలో ఉండగా అనిల్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో రెండు వర్గాల మధ్య తీవ్రమైన పొలిటికల్ ఫైట్ జరిగింది. ఎమ్మెల్యే అనిల్ పై ఆనం వివేకానందరెడ్డి తనయుడు ఆనం రంగమయూర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనంగా మారాయి. ఏసీ సెంటర్ కి వస్తే తేల్చుకుందామంటూ గతంలో సవాళ్లు కూడా విసురుకున్నారు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరడంతో ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నాయకులు కాస్త సైలెంట్ అయ్యారు. కానీ రెండు వర్గాల మధ్య ఉన్న గొడవ మాత్రం సద్దుమణగలేదు. 


వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గతంలో నెల్లూరు సిటీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నెల్లూరు సిటీకి వస్తానని, ప్రతి ఇంటికీ వెళ్తానని చెప్పారు ఆనం. దానికి మంత్రి హోదాలో ఉన్న అనిల్ కౌంటర్ ఇవ్వడంతో ఆ గొడవ అక్కడితో ఆగిపోయింది. తాజాగా నెల్లూరు జిల్లాకి సంబంధించి అనిల్ కి మంత్రి పదవి పోవడం, కాకాణికి మంత్రి పదవి రావడంతో మరోసారి వివాదం మొదలైంది. ఆనం, కాకాణి మళ్లీ దగ్గరయ్యారు. ఒకరకంగా అనిల్ వీరిద్దరికీ ఉమ్మడి శత్రువయ్యారు. కాకాణి ఫ్లెక్సీలను నెల్లూరు సిటీలో తొలగించడంతో ఆ అపవాదు అనిల్ పై పడింది. ఈరోజు మళ్లీ కాకాణి ఫ్లెక్సీలు తొలగించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. కాకాణి అభినందన ర్యాలీ రోజునే అనిల్ కూడా కార్యకర్తలతో ఆత్మీయ సదస్సు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.


అనిల్ వర్సెస్ ఆనం.. 
నిన్నటి వరకూ కాకాణి వర్సెస్ అనిల్ గా ఉన్న వ్యవహారం ఈరోజు అనిల్ వర్సెస్ ఆనం గా మారింది. ఆనం కుటుంబం వేసిన ఫ్లెక్సీలను కొంతమంది చించేయడంతో పరోక్షంగా అనిల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆనం రంగమయూర్ రెడ్డి. నెల్లూరుకి రావాలంటే వారికి కప్పం కట్టాలా, టోల్ గేట్ దాటాలా అంటూ ప్రశ్నించారు. ఈ దశలో ఈ గొడవ ఆనం వర్సెస్ అనిల్ అన్నట్టుగా టర్న్ తీసుకుంది. 


ఇటీవల కాకాణి అభినందన సభలో మాట్లాడిన ఆనం రామనారాయణ రెడ్డి మూడేళ్లలో జిల్లాకు జరగాల్సిన స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పారు. దీనిపై అనిల్ కూడా కౌంటర్ ఇచ్చారు. పార్టీలు మారేవారు కూడా తనపై మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. మొత్తానికి కాకాణి మంత్రి పదవి వ్యవహారం మరోసారి ఆనం, అనిల్ వర్గాల మధ్య చిచ్చు పెట్టిందని చెప్పాలి.