తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కోలా వెంకటేశ్వర్లు వైసీపీ తరపున జడ్పీటీసీగా ఉన్నారు. ఆయన వెంకటగిరిలో నివాసం ఉంటారు. వెంకటగిరి నుంచి తిరుపతి వెళ్లి, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి కారులో వెంకటగిరికి వస్తుండగా మార్గ మధ్యంలో రేణిగుంట మండలంలోని మర్రిగుంట వద్ద ప్రమాదం జరిగింది. ఇనుప లోడుతో వస్తున్న లారీని ఆయన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో జడ్పీటీసీ కోలా వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అదే కార్లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారి చొరవతో.. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల ఆనం రామనారాయణ రెడ్డి తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు తక్షణ వైద్యం అందేలా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు..




ఆనంకు సన్నిహితుడు


స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కోలా వెంకటేశ్వర్లు సన్నిహితుడు. ఆనంతోపాటే అన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటుంటారు. ఇటీవల వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. స్థానికంగా ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి హఠాత్తుగా ఇలా రోడ్డు ప్రమాదానికి బలికావడంతో వెంకటగిరివాసులు షాకయ్యారు.


ప్రమాదానికి కారణం ఏంటి..?


ప్రమాదానికి కారణం అతివేగమా, లేక నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడమా అనేది తేలాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్ లో వెంకటేశ్వర్లు చనిపోయారు. ఆసమయంలో ఆయనే కారు డ్రైవ్ చేస్తున్నారు. మిగతా ముగ్గురు గాయాలతో బయటపడటం విశేషం. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిలో మర్రిగుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది.


వైసీపీ నాయకుల సంతాపం..


జడ్పీటీసీ కోలా వెంకటేశ్వర్లు మృతి చెందడంతో ఎమ్మెల్యే ఆనం రామననారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతలు ఆయన ఈ ఘటనపై సంతాపం తెలిపారు. వెంకటగిరికి ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు. పార్టీ తరపున కూడా కుటుంబ సభ్యులకు సంతాప సందేశం అందింది.